చనిపోవడమూ ఓ హక్కేనా?

7 Jul, 2019 13:11 IST|Sakshi

సాక్షి, ఇంటర్నేషనల్‌ : మరణం వాయిదా వేయడం మినహా మరే ఆశ లేనప్పుడు, శారీరక బాధను భరించలేని దయనీయ పరిస్థితిలో.. రోగి లేదా అతని తరపున నమ్మకమైన వ్యక్తి అనుమతితో కారుణ్య మరణం ప్రసాదించవచ్చు. గౌరవప్రదమైన మరణం కూడా జీవించే హక్కులో భాగమే. - భారత సుప్రీంకోర్టు

42 ఏళ్లుగా మంచానికే పరిమితమై తీవ్ర దుఃఖం అనుభవించిన అరుణ రామచంద్ర షాన్‌బాగ్(ముంబయి).. కేసు విచారణలో భాగంగా సుప్రీంకోర్టుపై విధంగా వ్యాఖ్యానించింది. అయితే ఇలాంటి కేసే ఇప్పుడు ఫ్రాన్స్‌ దేశంలో ప్రజలను రెండుగా చీల్చింది. పది సంవత్సరాలనుంచి అచేతన స్థితిలో ఉన్న ఓ వ్యక్తికి కారుణ్య మరణం ప్రసాదించాలని సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత కోర్టు తీర్పునిచ్చింది. ఈ నిర్ణయంపై కొందరు విమర్శలు చేస్తుండగా, మరికొందరు తమ మద్దతును తెలిపారు. 

ఫ్రాన్స్‌కు చెందిన విన్సెంట్‌ లాంబార్ట్‌ 2008లో రోడ్డు ప్రమాదంలో గాయపడి అచేతన స్థితిలోకి వెళ్లిపోయాడు. వైద్య నిపుణులు కూడా అతడిని మామూలు స్థితికి తీసుకు రావడం కష్టమని తేల్చారు. దీంతో విన్సెంట్‌ భార్య కూడా కారుణ్య మరణానికి ఒప్పుకుంది. ప్రమాదం జరిగాక తనకు మరణం ప్రసాదించమని తనని కోరాడని తెలిపింది. దీంతో పదేళ్ల సుదీర్ఘకాలంలో జీవించే హక్కా?, చనిపోయే హక్కా? అంటూ నాటి నుంచి ఫ్రెంచ్‌ రాజకీయ నాయకుల చేతితో అతడు బంతిలా మారాడు. విన్సెంట్‌ కేసు ఫ్రెంచ్‌ న్యాయస్థానాలతో పాటు, యూరోపియన్‌ యూనియన్‌ కోర్టుకు వెళ్లింది.

చివరకు న్యాయస్థానం కారుణ్య మరణానికి అంగీకరించింది. ఇంతవరకూ బాగానే ఉన్నా, విన్సెంట్‌ తల్లి మాత్రం కారుణ్య మరణానికి ససేమిరా అంటోంది. తన కుమారునికి వైద్య సేవలు నిలిపివేయడాన్ని హింసగానే భావించాలని కోరుతూ ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఎమ్మానుయెల్‌ మెక్రాన్‌కు లేఖ రాశారు. దీనిపై స్పందించిన అధ్యక్షుడు ‘ఏ నిర్ణయం తీసుకునేది న్యాయపరంగా సంరక్షణ ఉన్న బాధితుని భార్యకే ఉంటుందని’   తేల్చి చెప్పారు. దీంతో మనకు ఇష్టమైన వారు మన కళ్లముందే దూరం అవుతున్నారని బాధ పడుతున్నతల్లికి సంఘీభావంగా కొందరు, ఇంత కష్టమైన బతుకు బతికే కన్నా చనిపోవడమే మేలని సర్దిచెప్పుకొంటున్న భార్యవైపు కొందరు మద్దతు తెలుపుతూ ఈ ‘విషాద పరీక్ష’పై ఫ్రెంచ్‌ దేశీయులు చర్చించుకుంటున్నారు.

మరిన్ని వార్తలు