54 ఏళ్ల తర్వాత స్వదేశానికి..

12 Feb, 2017 02:02 IST|Sakshi
54 ఏళ్ల తర్వాత స్వదేశానికి..

1963లో దారి తప్పి భారత్‌లోకి వచ్చిన చైనా సైనికుడు  
బీజింగ్‌: 54 ఏళ్ల క్రితం దారితప్పి భారత్‌కి వచ్చిన ఓ చైనా సైనికుడు ఎట్టకేలకు శనివారం స్వదేశానికి చేరుకున్నాడు. వాంగ్‌ కి (77) అనే చైనా సైనికుడు 1962లో జరిగిన భారత్‌–చైనా యుద్ధకాలంలో సరిహద్దు దాటొచ్చి భారత్‌లో చిక్కుకుపోయాడు. బీజింగ్‌ ఎయిర్‌పోర్టులో వాంగ్‌కు చైనా విదేశాంగ, భారత దౌత్యాధికారులు ఘన స్వాగతం పలికారు.

యుద్ధం ముగిశాక∙రాత్రి చీకట్లో దారి తప్పి 1963 జనవరి 1న ఇతను అస్సాంలోకి ప్రవేశించాడు. అక్కడి రెడ్‌ క్రాస్‌ సభ్యులు వాంగ్‌ను గుర్తించి పోలీసులకు అప్పగించారు. వాంగ్‌ ఆరేళ్ల జైలు శిక్ష అనుభవించి విడుదలయ్యాడు. తిరిగి చైనా వెళ్లేందుకు భారత అధికారులు అంగీకరించక పోవడంతో మధ్యప్రదేశ్‌ చేరుకుని అక్కడే ఓ మహిళను పెళ్లాడి వాచ్‌మన్  ఉద్యోగంలో చేరారు. స్థానికులు అతనికి రాజ్‌ బహదూర్‌ అని పేరు పెట్టారు. వాంగ్‌కు కొడుకు, కూతురు ఉన్నారు. కొడుక్కి ఓ కూతురుంది.

కొన్నాళ్ల క్రితం వాంగ్‌ బంధువు ఒకరు భారత పర్యటనకు వచ్చినప్పుడు అతణ్ని కలిసి విషయం తెలుసుకుని చైనాకు వెళ్లి వాంగ్‌కు పాస్‌పోర్టు వచ్చేలా చేశాడు. వాంగ్‌పై గతంలో బీబీసీ ప్రసారంచేసిన కార్యక్రమం సంచలనం కావడంతో విషయం ఇరుదేశాల విదేశాంగ శాఖలకు తెలిసి ఉమ్మడిగా చర్చించి.. భారత్‌కు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చేలా వీసా మంజూరు చేశారు. వాంగ్‌ భార్య, కూతురు అతనితోపాటు చైనా వెళ్లేందుకు నిరాకరించగా, కొడుకు, కోడలు, మనవరాలుతో కలిసి వాంగ్‌ శనివారం చైనా చేరుకున్నారు.

మరిన్ని వార్తలు