జిన్‌పింగ్‌తో సై.. ఇమ్రాన్‌కు నై

7 Jun, 2019 01:43 IST|Sakshi
షీ జిన్‌పింగ్‌, ఇమ్రాన్‌ ఖాన్‌

కిర్గిజిస్తాన్‌లో జూన్‌ 12 నుంచి ఎస్‌సీవో సమావేశం

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో భేటీ కానున్న మోదీ  

బీజింగ్‌/న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ల భేటీకి మరోసారి ము హూర్తం ఖరారైంది. కిర్గిజిస్తాన్‌ రాజధాని బిష్కెక్‌లో జూన్‌ 12–14 మధ్య జరిగే షాంఘై సహకార సదస్సు(ఎస్‌సీవో) సందర్భంగా వీరిద్దరూ సమావేశమవుతారని చైనాలో భారత రాయబారి విక్రమ్‌ మిస్రి తెలిపారు. షాన్‌డాంగ్‌ ప్రావిన్సులో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మిస్రి మాట్లాడుతూ..‘ఇటీవలికాలంలో భారత్, చైనాలు సుస్థిరమైన సంబంధాలను ఏర్పాటు చేసుకోవడంలో సఫలమయ్యాయి. గతేడాది మోదీ, షీ జిన్‌పింగ్‌లు నాలుగుసార్లు సమావేశమయ్యారు. వుహాన్‌లో 2018లో జరిగిన చరిత్రాత్మక భేటీతో ఇరుదేశాల మధ్య సంబంధాలు సరికొత్త ఎత్తుకు చేరుకున్నాయి. భారత్‌–చైనాల మధ్య గతేడాది ద్వైపాక్షిక వాణిజ్యం రూ.6.57 లక్షల కోట్ల(95 బిలియన్‌ డాలర్లు)కు నమోదుకాగా, ఈ ఏడాది రూ.6.92 లక్షల కోట్ల(100 బిలియన్‌ డాలర్లు)కు చేరుకోనుంది’ అని పేర్కొన్నారు.

ఇమ్రాన్‌తో భేటీకి నో..
షాంఘై సదస్సు సందర్భంగా పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌తో మోదీ సమావేశం కాబోరని భారత విదేశాంగ శాఖ తెలిపింది. పాక్‌ విదేశాంగ కార్యదర్శి సోహైల్‌ మహమూద్‌ ఇటీవల భారత్‌లో ప్రైవేటుగా పర్యటించిన నేపథ్యంలో మోదీ–ఇమ్రాన్‌ సమావేశమవుతారని వార్తలు వచ్చాయి. దీంతో ఈ విషయమై భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి కుమార్‌ స్పందిస్తూ.. ‘ఇమ్రాన్, మోదీల మధ్య ఎలాంటి భేటీ ఖరారు కాలేదు. పాక్‌ కార్యదర్శి సోహైల్‌ తన వ్యక్తిగత హోదాలో మూడ్రోజుల భారత పర్యటనకు వచ్చారు. ఆయన పర్యటనకు, ఇరుదేశాల ప్రధానుల మధ్య భేటీకి ఎలాంటి సంబంధం లేదు’ అని స్పష్టం చేశారు. పుల్వామా ఉగ్రదాడి, ప్రతీకారంగా భారత్‌ చేసిన వైమానిక దాడులతో పాక్‌–ఇండియాల మధ్య సంబంధాలు తీవ్రంగా దిగజారిన సంగతి తెలిసిందే. ఇటీవల రెండోసారి ప్రధానిగా మోదీ ఎన్నికైన అనంతరం ఫోన్‌చేసిన ఇమ్రాన్‌ఖాన్‌ ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు