ట్రంప్‌ను ఉడికించడమే కిమ్‌కు ఇష్టం

25 Aug, 2019 14:15 IST|Sakshi

ప్యాంగ్‌యాంగ్‌ : ఉత్తర కొరియా ప్రశాంతంగా ఉందంటే అనుమానించాలి. క్షిపణి పరీక్షకో, మరో మారణాయుధ పరీక్షకో ఏర్పాట్లు చేసుకుంటుందనుకోవాలి. తాజాగా ఆ దేశం వైపు నుంచి తూర్పు సముద్రంలో వచ్చి పడ్డ రెండు గుర్తుతెలియని వస్తువులు చూశాక దక్షిణ కొరియాకు ఈ సంగతి జ్ఞప్తికి వచ్చి ఉంటుంది. 17 నెలల మౌనం తర్వాత గత నెల 25 నుంచి మొదలుకొని ఇంతవరకూ ఉత్తరకొరియా ఏడు క్షిపణి ప్రయోగాలు జరిపింది. శనివారం జరిపిన పరీక్షలపై ఉత్తర కొరియా మీడియా కొన్ని ఫొటోలను విడుదల చేసింది. విజయవంతంగా పరీక్షించిన సూపర్‌ లార్జ్‌ మల్టిపుల్‌ రాకెట్‌ లాంచర్‌ను మిరాకిల్‌గా అభివర్ణించింది. క్షిపణి పరీక్షలకు ముందు అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ఆహ్లాదంగా ఉన్న ఫోటోలను, క్షిపణుల దగ్గర నిలబడి ఇచ్చిన ఫోజులను విడుదల చేసింది. క్షిపణుల దగ్గర నిలబడిన కిమ్‌ ఫొటోలను ఉద్దేశిస్తూ ‘ఉత్తరకొరియా దేశానికి విలువైన సంపద’ అని వ్యాఖ్యానించింది.

కాగా, ఉత్తరకొరియా క్షిపణి పరీక్షలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మాట్లాడుతూ మిసైల్‌ పరీక్షలు జరపడం కిమ్‌కు అభిరుచి అని తెలిపారు. ఈ పరీక్షల ప్రభావం ఆ దేశంతో చేసుకునే ఒప్పందంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని పేర్కొన్నారు. అయితే అమెరికా ఆంక్షలను, ఒత్తిడిని ఎప్పుడూ తేలిగ్గా తీసుకునే ఉత్తరకొరియా మరోసారి అమెరికాకు ముఖ్యంగా ట్రంప్‌కు చురకలంటించింది. తమ దేశ వ్యూహాత్మక రక్షణ కోసం మేం తీసుకునే చర్యలపై ఎలాంటి ఒత్తిడిలు పనిచేయవని స్పష్టం చేసింది. ఒకపక్క అమెరికా శాంతి వచనాలు వల్లిస్తూ, తమతో చర్చల తతంగం నడుపుతూ.. మరోపక్క దక్షిణ కొరియాను రెచ్చగొట్టి ఉద్రిక్తతలు సృష్టిస్తోందని ఆరోపించింది. కిమ్‌ జరిపే పరీక్షలను చూసి ట్రంప్‌ ఉడుక్కోవడం తప్ప మరేం చేయలేడని సరదాగా ఆ దేశ మీడియా వ్యాఖ్యానించింది.

దక్షిణ కొరియా–అమెరికా ఉమ్మడి సైనిక విన్యాసాలపై ఘాటుగా స్పందిస్తూ క్షిపణి ప్రయోగాలను ఉత్తరకొరియా పునః ప్రారంభించడం తెలిసిందే. అయితే ఉత్తరకొరియా తాజాగా ప్రయోగించినవి స్వల్పశ్రేణి బాలిస్టిక్‌ క్షిపణులు అయి ఉంటాయని దక్షిణ కొరియా సైనిక ప్రతినిధి అంటున్నారు. ప్రస్తుతం తమ సముద్ర జలాల్లో పడినవేమిటో తెలుసుకోవడానికి దక్షిణ కొరియా ప్రయత్నిస్తోంది. అందుకు అమెరికా సాయం తీసుకుంటోంది. తమ పరిశీలనాంశాలను జపాన్‌కు కూడా అందజేస్తామని ఆ దేశం ప్రకటించింది.

మరిన్ని వార్తలు