ఆపరేషన్‌ గోల్డ్‌ ఫిష్‌ @ 250 డాలర్లు..

12 Feb, 2017 01:24 IST|Sakshi
ఆపరేషన్‌ గోల్డ్‌ ఫిష్‌ @ 250 డాలర్లు..

సాధారణంగా మన ఇళ్లలో పెంచుకుంటున్న పెంపుడు జంతువులను మన ఇంటి మనుషుల్లాగే ప్రేమిస్తాం.. వాటికేమైనా జబ్బు చేస్తే మన సొంత పిల్లలకు రోగం చేసినంతగా బాధ పడుతాం.. వెంటనే వాటిని చికిత్స కోసం వెటర్నరీ డాక్టర్‌ దగ్గరికి తీసుకెళ్తాం.. సరిగ్గా అలాగే చేసింది ఇంగ్లండ్‌లోని ఓ కుటుంబం.. అయితే ఇక్కడ జబ్బు చేసింది ఏ కుక్కకో.. పిల్లికో అయితే కాదు... ఒక బంగారు చేప (గోల్డ్‌ ఫిష్‌)కు. ఆ గోల్డ్‌ ఫిష్‌ వయసు 20 ఏళ్లు. దాని శరీరం లోపలఒక ట్యూమర్‌ (గడ్డ) ఉన్నట్లు సదరు కుటుంబం గమనించింది. వెంటనే ప్రముఖ వైద్యుడు డాక్టర్‌ ఫాయే బేతేల్‌ వద్దకు తీసుకెళ్లారు.

సుమారు 30 నిమిషాల పాటు డాక్టర్‌ సర్జరీ నిర్వహించి అతి కష్టం మీద ఆ ట్యూమర్‌ను వెలికి తీసి ఆ చేపను కాపాడారు. చేపకు అనస్థీసియా ఇచ్చి శస్త్ర చికిత్స నిర్వహించినట్లు ఆపరేషన్‌ అనంతరం డాక్టర్‌ చెప్పారు. చేప ఎంతో చిన్నది కావడంతో ఆపరేషన్‌ చేయడం ఎంతో కష్టతరమైందని ఆమె తెలిపారు. ప్రస్తుతం చేప ఆరోగ్యం నిలకడగా ఉందని, తన ఇంట్లో ఆనందంగా ఈత కొడుతోందని పేర్కొన్నారు. ఆ చేప వయసు ఆ యజమాని పిల్లల వయసు కంటే ఎక్కువ కావడం గమనార్హం. అందుకే ఆ చేప అంటే ఆ యజమానికి ఎనలేని ప్రేమ.. ఇంతకీ ఆ ఆపరేషన్‌కు అయిన ఖర్చు ఎంతో తెలుసా? అక్షరాల రెండు వందల యాభై డాలర్లు(సుమారు రూ. 17 వేలు).

మరిన్ని వార్తలు