ఆ ఆరోపణలను తోసిపుచ్చిన పాక్‌

24 Jun, 2018 21:12 IST|Sakshi

ఇస్లామాబాద్‌ : భారత హైకమిషనర్‌ అజయ్‌ బిసారియాను ఇస్లామాబాద్‌ సమీపంలోని ప్రముఖ గురుద్వారలోకి వెళ్లేందుకు అనుమతించలేదన్న ఆరోపణలను పాకిస్తాన్‌ తోసిపుచ్చింది. భారత్‌లో వివాదాస్పద సినిమాల విడుదలకు నిరసనగా సిక్కుల నిరసనల నేపథ్యంలో దౌత్యవేత్త తన పర్యటనను వాయిదా వేసుకున్నారని వివరణ ఇచ్చింది. ఇస్లామాబాద్‌లో తమ హైకమిషనర్‌, కాన్సుల్‌ అధికారులను గురుద్వారాలోకి అనుమతించకపోవడంపై ఢిల్లీలో పాక్‌ డిప్యూటీ హైకమిషనర్‌ సయ్యద్‌ హైదర్‌షాకు భారత్‌ నిరసన తెలిపిన నేపథ్యంలో పాకిస్తాన్‌ ఈ మేరకు స్పందించింది.

భారత యాత్రికులను కలిసేందుకు, గురుద్వారను సందర్శించేందుకు తనకు అనుమతి ఇవ్వలేదని భారత హైకమిషనర్‌ అజయ్‌ బిసారియా పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ విషయం తాను పాకిస్తాన్‌ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతానని, ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా వ్యవహరిస్తామని ఆయన పేర్కొన్నారు. భారత దౌత్యవేత్తలను వారి కార్యకలాపాలకు అనుమతించకుండా అడ్డుకోవడం దౌత్యసంబంధాలపై వియన్నా సదస్సు నిబంధనల ఉల్లంఘనేనని పాకిస్తాన్‌పై భారత్‌ మండిపడింది. 

మరిన్ని వార్తలు