రఫేల్‌తో బలీయ శక్తిగా ఐఏఎఫ్‌

7 Oct, 2019 02:54 IST|Sakshi

క్షిపణి తయారీ సంస్థ ఎంబీడీఏ వ్యాఖ్య

పారిస్‌: అత్యాధునిక రఫేల్‌ యుద్ధ విమానాల చేరికతో భారత వైమానిక దళ సామర్థ్యం గణనీయంగా పెరుగుతుందని యూరోప్‌కు చెందిన క్షిపణి తయారీ సంస్థ ఏంబీడీఏ పేర్కొంది. తాము తయారు చేసిన మెటియొర్, స్కాల్ప్‌ క్షిపణులను రఫేల్‌ యుద్ధ విమానాలు ప్రయోగించగలవంది. ‘ఆకాశం నుంచి ఆకాశంలోని లక్ష్యాలపైకి మెరుపువేగంతో, కచ్చితత్వంతో దాడి చేయగల మెటియొర్, ఆకాశం నుంచి భూమిపై సుదూర లక్ష్యాలను ఛేదించగల స్కాల్ప్‌ క్షిపణులు భారత వైమానిక దళాన్ని మరింత శక్తిమంతం చేస్తాయి.

ఈ సామర్థ్యం భారత్‌కు గతంలో లేదు’ అని ఎంబీడీఏ ఇండియా చీఫ్‌ పీడ్వాచ్‌ వ్యాఖ్యానించారు. ‘రఫేల్‌ అద్భుతమైన యుద్ధ విమానం. ఇది ఆధునిక ఆయుధ శ్రేణితో ఉంది. ఈ ఒప్పందంలో మేం కూడా భాగస్వాములం కావడం సంతోషకరం’ అన్నారు. ఫ్రాన్స్‌ నుంచి రూ. 58 వేల కోట్లతో 36 రఫేల్‌ యుద్ధవిమానాలను భారత్‌ కొనుగోలు చేస్తుండటం తెలిసిందే. అందులో తొలి విమానాన్ని మంగళవారం భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ ఫ్రాన్స్‌ మిలటరీ అధికారుల నుంచి స్వీకరించనున్నారు. కంటికి కనిపించని లక్ష్యాలను ఛేదించడంలో మెటియొర్‌ క్షిపణి సామర్థ్యం అమోఘమని పీడ్వాచ్‌ పేర్కొన్నారు.

అలాగే, లక్ష్యాల ఛేదనలో స్కాల్ప్‌కు తిరుగులేదని కితాబిచ్చారు. ఈ రెండు క్షిపణులతో కూడిన రఫే ల్‌ చేరికతో భారత వైమానిక దళం ప్రాంతీయంగా బలీయ శక్తిగా మారుతుందన్నారు. అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ మెటియొర్‌ కచ్చితత్వంతో పనిచేస్తుందని, ఫైటర్‌ జెట్స్‌ నుంచి చిన్నవైన మానవ రహిత విమానాల వరకు అన్నింటినీ కచ్చితత్వంతో కూల్చివేయగలదన్నారు. ఆకాశం నుంచి ప్రయోగించి భూమిపై ఉన్న సుదూర లక్ష్యాలను ముందస్తు ప్రణాళికతో ఛేదించడంలో స్కాల్ప్‌ సామర్థ్యం తిరుగులేనిదన్నారు. భారత్‌ అవసరాలకు అనుగుణంగా రఫేల్‌లో మార్పులు చేశారు.

ఫ్రాన్స్‌లో రాజ్‌నాథ్‌ ఆయుధ పూజ
న్యూఢిల్లీ: రఫేల్‌ యుద్ధ విమానాలను స్వీకరించేందుకు ఫ్రాన్స్‌ వెళ్తున్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌.. దసరా సందర్భంగా అక్కడే పారిస్‌లో ఆయుధ పూజ చేయనున్నారు. దసరా రోజు ఆయుధ పూజ చేయడం సంప్రదాయం.  దసరాతో పాటు భారత వైమానిక దళ వ్యవస్థాపక దినోత్సవం కూడా కావడం విశేషం. రఫేల్‌ యుద్ధ విమానాన్ని స్వీకరించిన అనంతరం.. పనితీరును ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు రాజ్‌నాథ్‌ అందులో ప్రయాణించనున్నారు.

36 యుద్ధ విమానాల్లో తొలి విమానాన్ని మంగళవారమే స్వీకరించినప్పటికీ.. తొలి నాలుగు రఫేల్‌ యుద్ధవిమానాలు భారత్‌కు వచ్చే ఏడాది మేలోనే వస్తాయి. రఫేల్‌ను భారత్‌కు అందించే కార్యక్రమంలో ఫ్రాన్స్‌ మిలటరీ ఉన్నతాధికారులు, డసో ఏవియేషన్‌ సీనియర్‌ అధికారులు పాల్గొంటారు.  రూ. 58 వేల కోట్లతో 36 రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలు కోసం ఫ్రాన్స్‌తో 2016లో ఒప్పందం కుదిరింది. పలు ఆధునిక ఆయుధాలు, క్షిపణులను ఈ యుద్ధవిమానం నుంచి ప్రయోగించవచ్చు. మొదట వచ్చే యుద్ధవిమానాలను అంబాలాలోని వైమానిక దళ స్థావరంలో మోహరించనున్నారు.

మరిన్ని వార్తలు