కారు చెకింగ్.. రవాణా మంత్రికి చేదు అనుభవం!

12 Dec, 2016 14:44 IST|Sakshi
కారు చెకింగ్.. రవాణా మంత్రికి చేదు అనుభవం!

సాధారణంగా ఎవరైనా వాహనాలు నడుపుతూ సరైన పత్రాలు లేక పట్టుబడితే వారికి రవాణాశాఖ మంత్రులు ఏం చెబుతారో అందరికీ తెలుసు. డ్రైవింగ్ చేసేవాళ్లతో తప్పనిసరిగా లైసెన్స్ ఉండాలని, ఇన్సూరెన్స్ తో పాటు ఇతర పత్రాలు లేకపోతే ఇబ్బందులు తప్పవని సలహాలిస్తారు. అయితే స్కాట్లాండ్లో రవాణాశాఖ మంత్రి హుంజా యూసఫ్ కు చేదు అనుభవం ఎదురైంది. ట్రాఫిక్ పోలీసుల తనిఖీలలో భాగంగా మంత్రి నడుపుతున్న కారును ఆపి చెక్ చేశారు. దీంతో ఆయన వద్ద ఇన్సూరెన్స్, ఇతర పత్రాలు సరైనవి కావని తేలింది. అక్కడి ట్రాఫిక్ చట్టాల ప్రకారం ఇతరుల వాహనాలు నడపాలంటే అందుకు తగిన పర్మిషన్ లెటర్, కొన్ని పత్రాలు డ్రైవింగ్ చేసే వ్యక్తి వద్ద తప్పనిసరిగా ఉండాలి.

గత వారం(డిసెంబర్ 2న) డింగ్ వాల్ సమీపంలో స్కాట్లాండ్ పోలీసులు రాత్రి 7 గంటల సమయంలో తనిఖీలు చేయగా a835 అనే నంబర్ ఉన్న కారును మంత్రి యూసఫ్ నడుపుతున్నారు. మంత్రి కారును ఆపి తనిఖీ చేయగా ఆయన వద్ద ఆ కారు నడిపేందుకు సరైన పత్రాలు లేవని తేలింది. ఈ విషయంపై మీడియా ఆయనను ప్రశ్నించగా.. తన వద్ద అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయని, అందుకే తాను వాహనాన్ని డ్రైవ్ చేశానని చెప్పుకొచ్చారు. ఇతరుల వాహనాలు నడిపేందుకు కావలసిన అన్ని విషయాలు తనకు తెలుసునని చెప్పారు. చివరికి విచారణలో ఆయన ఇన్సూరెన్స్ సర్టిఫికెట్ ప్రాసెస్ పూర్తికాలేదని తేలింది. దీంతో ట్రాఫిక్ పోలీసులు నిర్ణయించిన ఫైన్ మొత్తాన్ని చెల్లించారు. ఇన్సూరెన్స్ కవరేజ్ లో పూర్తి సమాచారం అప్ డేట్స్ చేసుకుంటానని మంత్రి యూసఫ్ వివరించారు.

మరిన్ని వార్తలు