ఆశలు మొలకెత్తాయి

17 Jan, 2019 02:27 IST|Sakshi

మన చందమామపై విత్తనం మొలకెత్తింది. ఒకటి కాదు.. రెండు కాదు.. మూడు రకాల విత్తనాలు అంకురించాయి! అయితే ఏంటి.. అంటారా? చాలానే విషయం ఉంది. జాబిల్లికి అవతలివైపు అంటే ఎప్పుడూ చీకట్లోనే ఉండే ప్రాంతంలో విత్తనాలు మొలకెత్తడం ఒక విశేషమైతే.. భవిష్యత్తులో మనిషి చందమామపై ఇల్లు కట్టుకోవాలనుకుంటే.. తిండికేం ఢోకా లేదన్న భరోసా ఇచ్చే ప్రయోగం కూడా ఇదేనన్నది శాస్త్రవేత్తల అంచనా. సుమారు ఏడాది కింద ఛాంగే–4 పేరుతో చైనా జాబిల్లిపైకి ఓ ల్యాండర్‌ను ప్రయోగించిన విషయం తెలిసిందే. ఇది ఇప్పటివరకు ఎవరూ చూడని జాబిల్లి అవతలి ప్రాంతాన్ని చేరింది. తనతో పాటు 7 అంగుళాల పొడవైన ప్రత్యేకమైన పెట్టెను మోసుకెళ్లింది. ఇందులో పత్తి, బంగాళాదుంప, ఆవాలు, అరబిడోపోసిస్‌ అనే చిన్న పూల మొక్క విత్తనాలతో పాటు ఈస్ట్, ఈగ గుడ్లు, గాలి, నీళ్లు ఉన్నాయి.

చందమామపై ఉండే అత్యధిక, అత్యల్ప ఉష్ణోగ్రతలను, రేడియోధార్మికతలను తట్టుకునే వస్తువులను ఎంపిక చేసి మరీ అక్కడకు పంపారన్నమాట. నియంత్రిత వాతావరణంలో విత్తనాలు మొలకెత్తుతాయా.. లేదా అనేది పరిశీలించాలన్నది ప్రయోగ లక్ష్యం. కొన్ని రోజుల కింద పత్తి విత్తనాలు చిగురించాయి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనూ కొన్ని విత్తనాలను మొలకెత్తించి చూసినా.. అవి అత్యల్ప గురుత్వాకర్షణ శక్తి పరిస్థితుల్లో విత్తనాలు మొలకెత్తుతాయా లేదా.. అన్నది చూసేందుకే. జాబిల్లిపై అనేక దుర్భర పరిస్థితులను తట్టుకుని మరీ విత్తనాలు మొలకెత్తగలవన్న విషయం రుజువు కావడంతో భవిష్యత్తులో అక్కడ మనిషి నివాసం ఏర్పరచుకుంటే పంటలు పండించుకునే అవకాశం ఉందని ఈ ప్రయోగం ద్వారా తెలుస్తోంది. చైనా అంతరిక్ష పరిశోధన సంస్థ పత్తి విత్తనం మొలకెత్తిన ఫొటోను విడుదల చేసినా.. బంగాళా దుంప, ఆవాల విత్తనాలు కూడా మొలకెత్తాయని ఈ ప్రయోగాల్లో పాల్గొన్న ప్రొఫెసర్‌ లియూ హాన్‌లాంగ్‌ వెల్లడించారు.  

మరిన్ని వార్తలు