ఫేస్‌బుక్‌ ప్రతినిధిపై మంత్రి ప్రశ్నల వర్షం...

27 Mar, 2018 12:19 IST|Sakshi
సింగపూర్‌ మంత్రి షణ్ముగం, ఫేస్‌బుక్‌ ప్రతినిధి మిల్లర్‌

సింగపూర్‌ : కేంబ్రిడ్జ్‌ అనలిటికా అంశంపై ఫేస్‌బుక్‌ వివిధ దేశాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. భారత ప్రభుత్వం కూడా వివరణ కొరుతూ ఫేస్‌బుక్‌ సంస్థకు నోటీసులు పంపిన విషయం తెలిసిందే. పలు దేశాల అంతర్గత చర్చల్లో కూడా ఫేస్‌బుక్‌ డేటా లీకేజీ చర్చనీయాంశంగా మారింది. కానీ సింగపూర్‌ మాత్రం ఫేస్‌బుక్‌కు నేరుగా తమ అభిప్రాయాలను తెలిపింది. పార్లమెంటులో ఏర్పాటు చేసిన సమావేశంలో సింగపూర్‌ మంత్రి ఫేస్‌బుక్‌ ప్రతినిధిపై ప్రశ్నల వర్షం కురిపించారు.

సింగపూర్‌ పార్లమెంట్‌ సెలెక్ట్‌ కమిటీ వారం రోజుల పాటు సామాజిక మాధ్యమాల ద్వారా జరుగుతున్న మోసాలు, తప్పుడు సమాచార వ్యాప్తి గురించి పరిశీలించి, నివేదిక రూపొందించింది. ఈ కమిటీలో ఫేస్‌బుక్‌ పసిఫిక్‌ ఆసియా ఉపాధ్యక్షుడు(పబ్లిక్‌ పాలసీ) సైమన్‌ మిల్లర్‌తో పాటు గూగుల్‌, ట్వీట్టర్‌ ప్రతినిధులు కూడా సభ్యులుగా ఉన్నారు. ఈ నివేదిక గత గురువారం రోజు(మార్చి 22) పార్లమెంటేరియన్‌ సదస్సులో చర్చకు  వచ్చింది. ఫేస్‌బుక్‌, గూగుల్‌, ట్వీట్టర్‌పై కమిటీ అధ్యయనం చేసినప్పటికీ, ఫేస్‌బుక్‌ అంశం ప్రధానంగా చర్చకు వచ్చింది.

ఈ సందర్భంగా సింగపూర్‌ న్యాయశాఖ మంత్రి కె. షణ్ముగం, ఫేస్‌బుక్‌ ప్రతినిధి మిల్లర్‌ మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. కేంబ్రిడ్జ్‌ అనలిటికా ద్వారా 5 కోట్ల మంది వివరాలు చోరికి గురయినప్పటికీ ఫేస్‌బుక్‌ గుర్తించలేకపోయిందని షణ్ముగం ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు అకౌంట్ల ద్వారా మోసాలకు పాల్పడుతున్న వారిపై నిఘా పెట్టడం లేదని వ్యాఖ్యానించారు. మూడు గంటల పాటు కొనసాగిన సమావేశంలో దాదాపు గంట పాటు షణ్ముగం, మిల్లర్‌ మధ్య వాగ్వాదం నడిచింది. ఫేస్‌బుక్‌పై వస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిందిగా కోరారు. మిల్లర్‌ సమాధానం చెప్పడం కోసం ప్రయత్నిస్తుంటే ‘యస్‌ ఆర్‌ నో’ ఏదో ఒకటే చెప్పాలన్నారు . గూగుల్‌, ట్వీట్టర్‌ ప్రతినిధులు తమ సైట్లలో ఫేక్‌ న్యూస్‌ వ్యాప్తి చెందకుండా ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. ఈ సమావేశానికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

మరిన్ని వార్తలు