చైనాలో స్వచ్ఛ టవర్!

22 Oct, 2016 02:50 IST|Sakshi
చైనాలో స్వచ్ఛ టవర్!

పీల్చే గాలి కలుషితమైపోతోంది. అది ఢిల్లీ... ముంబై... షాంఘై ఏదైనా కావచ్చు. రోడ్లపై తిరిగే వాహనాలను నియంత్రించడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించేందుకు ఢిల్లీ ప్రభుత్వం ఓ ప్రయోగం చేసి గమ్మున ఉండిపోయింది. అంటే వర్కవుట్ కాలేదని! అయితే చైనా దీనికి భిన్నంగా ఒకదాని తరువాత ఒకటి ప్రయత్నాలు చేస్తూ పోతోంది. ఇందుకు తాజా ఉదాహరణ ఫొటోలో కనిపిస్తున్న ‘స్మాగ్ టవర్’. వాహనాల నుంచి వెలువడే పొగలో ఉండే అతిసూక్ష్మమైన కాలుష్య పదార్థాలను స్మాగ్ అంటారు. ఈ టవర్ గాల్లో ఉండే స్మాగ్‌ను పీల్చేసుకుని స్వచ్ఛమైన గాలిని బయటకు వదులుతుంది. దాదాపు 21 అడుగుల పొడవుండే ఈ స్మాగ్ టవర్స్ ఒకొక్కటి గంటకు 30 వేల ఘనపు మీటర్ల గాలిని శుద్ధి చేయగలదు.

టవర్‌లోపల నెగటివ్ చార్జ్‌తో ఉండే ఉపరితలంపై పాజిటివ్ అయాన్లు, దుమ్మూధూళి, స్మాగ్ అతుక్కుపోతాయి. నెదర్లాండ్స్‌కు చెందిన డాన్ రూస్‌గార్డే డిజైన్ చేసిన ఈ టవర్లు కేవలం 1400 వాట్ల విద్యుత్తుతో పనిచేస్తాయి. ఇంకోలా చెప్పాలంటే రెండు మిక్సీలు వాడేంత విద్యుత్తు అన్నమాట. సరే... అంతా బాగానే ఉందిగానీ ఈ యంత్రం నుంచి స్వచ్ఛమైన గాలి మాత్రమే బయటకొస్తూంటే... స్మాగ్ అంతా ఏమవుతుంది? రెండో ఫొటోలో ఓ ఉంగరం కనిపిస్తోందా? దాని మధ్యలో నల్లగా కనిపిస్తోందే.. అది ఈ టవర్ సేకరించిన స్మాగ్. ఈ ఒక్క ఉంగరంలో ఉన్న స్మాగ్ వెయ్యి ఘనపు మీటర్ల గాలిని శుద్ధి చేస్తే వచ్చింది. ఈ లెక్కన ఈ టవర్ రోజుకు 300 ఉంగరాలకు సరిపడా స్మాగ్‌ను సేకరిస్తుందన్నమాట. రూస్‌గార్డే ఈ ఉంగరాలు ఒకొక్కదాన్ని 250 యూరోల చొప్పున విక్రయిస్తున్నారు. భలే ఐడియా కదూ...!

వాతావరణంలోంచి టవర్ తన లోపలికి లాగేస్తున్న స్మాగ్... ఇదిగో ఈ ఉంగరం లాంటి పరికరం (స్మాగ్ రింగ్) లోకి చేరుతుంది.

మరిన్ని వార్తలు