అనగనగా ఒక రోజు..ఆ రోజున ఏం జరిగిందంటే..

6 Dec, 2018 01:58 IST|Sakshi

సమస్య : 50వ అంతస్తులో అగ్ని ప్రమాదం.. ఒక వ్యక్తి అందులో చిక్కుకుని ఉన్నాడు.. ప్రాణం పోయేలా ఉంది.. ఈ ట్రాఫిక్‌లో అగ్నిమాపక శకటాలు వెళ్లాలంటే టైమ్‌ పడుతుంది.. అంత సమయమూ లేదు.. అదీ 50వ అంతస్తు అంటే.. అక్కడికి చేరుకోవడం.. అతడిని ప్రాణాలతో రక్షించడం.. డౌటే..

పరిష్కారం : మెసేజ్‌ ‘నెట్‌గార్డ్‌’కు చేరింది.. అంతే.. ఈ సెల్ఫ్‌ ఫ్లయింగ్‌ డ్రోన్‌ రివ్వున ఎగిరింది.. ఏరియా వివరాలు రావడంతో జీపీఎస్‌ ద్వారా తనంతట తానే అక్కడికి వెళ్లింది.. అగ్నిప్రమాదం జరిగిన అంతస్తును గుర్తించింది.. వెంటనే నాలుగు భాగాలుగా విడిపోయింది.. రక్షణ వలను సిద్ధం చేసింది.. దాన్ని చూడగానే.. భవనంలో చిక్కుకున్న వ్యక్తికి ప్రాణం లేచొచ్చింది.. వెంటనే అక్కడ నుంచి కిందకు దూకేశాడు.. నెట్‌గార్డ్‌లో సెన్సర్లు యాక్టివేట్‌ అయ్యాయి. అతడు సరిగ్గా ఎక్కడ దూకుతాడన్న విషయాన్ని అంచనా వేశాయి. రక్షణ వలను అక్కడికి తీసుకెళ్లాయి. బాధితుడిని క్షేమంగా కిందకు తీసుకొచ్చాయి.

ఇదసలు సాధ్యమా? సాధ్యమేనంటున్నారు చైనాలోని గ్వాంగ్‌డాంగ్‌ పాలిటెక్నిక్‌ వర్సిటీకి చెందిన విద్యార్థులు..ఈ వర్సిటీకి చెందిన ఆరుగురు విద్యార్థుల బృందం ఈ నెట్‌గార్డ్‌ కాన్సెప్ట్‌ను డిజైన్‌ చేసింది. ఈ డిజైన్‌కు ఇటీవలే గోల్డెన్‌ పిన్‌ కాన్సెప్ట్‌డిజైన్‌ పురస్కారం కూడా లభించింది. ఈ డిజైన్‌ వాస్తవ రూపం దాలిస్తే.. సూపర్‌గా ఉంటుంది కదూ..

మరిన్ని వార్తలు