వినువీధిలోకి విజ్ఞాన శిఖరం

15 Mar, 2018 01:26 IST|Sakshi
స్టీఫెన్‌ హాకింగ్‌

స్టీఫెన్‌ హాకింగ్‌ కన్నుమూత

వీల్‌చైర్‌ నుంచేవిశ్వం లోతుల్ని ఛేదించిన శాస్త్రవేత్త

నిరాటంకంగా పరుగెత్తే కాలం ఒక్కసారి ఆగిపోయింది!

ఇంట్లోనే ప్రశాంతంగా తుదిశ్వాస విడిచిన విఖ్యాత శాస్త్రజ్ఞుడు

ఖగోళ–భౌతిక పరిశోధనలతో ఎనలేని కీర్తి సొంతం

పిన్న వయసులోనే వీల్‌చైర్‌కు పరిమితమైనా అద్భుత ఆవిష్కరణలు

ప్రపంచవ్యాప్తంగా నివాళులర్పించిన ప్రముఖులు

లండన్‌: విశ్వవిఖ్యాత ఖగోళ, సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్‌ హాకింగ్‌ (76) తనువు చాలించారు. బ్రిటన్‌లోని కేంబ్రిడ్జి విశ్వ విద్యా లయం సమీపంలోని తన ఇంట్లో బుధవారం  తెల్లవారుజామున ఆయన ప్రశాంతంగా తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. ‘మా నాన్న మరణం మమ్మల్ని తీవ్ర వేదనకు గురిచేస్తోంది. ఆయన గొప్ప శాస్త్ర జ్ఞుడు. అంతకుమించి ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన మనిషి. ఆయన పరిశోధనలు, ఆవిష్క రణలను రాబోయే తరతరాలు గుర్తుంచుకుం టాయి. ఆయన ధైర్యం, మేధస్సు, హాస్యం ప్రపంచంలో అనేక మందిలో స్ఫూర్తి నింపాయి. నాన్న మరణం మా కుటుంబానికే కాదు, యావత్‌ ప్రపంచానికి తీరని లోటు’ అని హాకింగ్‌ ముగ్గురు పిల్లలు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

హాకింగ్‌ మృతికి నివాళిగా కేంబ్రిడ్జి వర్సిటీ కాలేజ్‌లో జెండాను అవనతం చేశారు. విద్యార్థులు, అధ్యాపకులు హాకింగ్‌కు నివాళులర్పించారు. 21ఏళ్ల వయసుకే అత్యంత అరుదైన ‘అమియోట్రోపిక్‌ లాటరల్‌ స్లె్కరోసిస్‌’ (ఏఎల్‌ఎస్‌) అనే వ్యాధి బారిన పడి వీల్‌చైర్‌కే పరిమితమైన హాకింగ్‌.. పట్టుదలతో తన శారీరక లోపాలను అధిగమించి విశ్వ రహస్యాలను ఛేదించారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొంది అల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ వంటి ప్రఖ్యాత శాస్త్రవేత్తల సరసన చోటు సంపాదించుకున్నారు హాకింగ్‌.  ‘మెదడు బాగా పనిచేస్తున్న తరుణంలో అవయవ లోపాలు ఉన్నంత మాత్రాన మనుషులు తమ సామర్థ్యాలకు పరిమితి విధించుకోవాల్సిన అవసరం లేదని నేను ప్రపంచానికి చాటాలనుకున్నాను’ అని హాకింగ్‌ గతంలో అన్న మాటలు ఆయన ఆత్మ విశ్వాసాన్ని ప్రతిబింబిస్తాయి.

ప్రముఖుల నివాళులు
బ్రిటన్‌ ప్రధాని థెరెసా మే, భారత ప్రధాని మోదీ సహా ప్రపంచ వ్యాప్తంగా ఎందరో ప్రముఖులు హాకింగ్‌ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. ‘తన తరం శాస్త్రవేత్తల్లో స్టీఫెన్‌ హాకింగ్‌ మహోన్నతమైన వారు. ఆయన కృషిని ప్రపంచం ఎన్నటికీ మరిచిపోదు. స్టీఫెన్‌ మెదడు అత్యద్భుతం. సంకల్పం, హాస్యం, ధైర్యాల మేళవింపు అయిన ఆయన జీవితం రాబోయే తరాల్లోనూ ప్రతి ఒక్కరికీ ఆదర్శ ప్రాయం’ అని థెరెసా మే అన్నారు. మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల కూడా హాకింగ్‌ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘ఈ రోజు మనం గొప్ప మనిషిని కోల్పోయాం.

విజ్ఞానశాస్త్రానికి ఆయన అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి’ అని సత్య పేర్కొన్నారు. బ్రెగ్జిట్‌కు అనుకూలంగా బ్రిటన్‌ ప్రజలు ఓటేసిన అనంతరం ఓ రోజు హాకింగ్‌కు బ్రిటన్‌ ప్రభుత్వం ‘ప్రైడ్‌ ఆఫ్‌ బ్రిటన్‌’ పురస్కారాన్ని అందజేసింది. థెరెసా మే హాజరైన ఆ సభలో హాకింగ్‌ మాట్లాడుతూ ‘ఎంతో కష్టమైన గణిత సమస్యలను నేను రోజూ పరిష్కరిస్తుంటాను. కానీ బ్రెగ్జిట్‌ లెక్కలు చేయమని మాత్రం నన్ను దయచేసి అడగొద్దు’ అని అనడంతో సభలోని వారు నవ్వు ఆపుకోలేకపోయారు. యంత్రాల సాయంతో మాట్లాడుతున్నా ఇలాంటి చలోక్తులతో హాకింగ్‌ ఎప్పుడూ చుట్టుపక్కల వారిని ఉల్లాసంగా ఉంచేవారు.

ఆయన స్ఫూర్తిప్రదాత ప్రధాని నరేంద్ర మోదీ
స్టీఫెన్‌ హాకింగ్‌ మృతికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంతాపం ప్రకటించారు. ఎన్ని కష్టాలు ఎదురైనా, శరీరం సహకరించకపోయినా అంతరిక్ష శాస్త్రం అధ్యయనానికి ఆయన చూపిన పట్టుదల ప్రపంచ వ్యాప్తంగా ప్రజలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని తెలిపారు. హాకింగ్‌ గొప్ప శాస్త్రవేత్త, విద్యావేత్త అని తన ట్వీటర్‌ సందేశంలో పేర్కొన్నారు.  

చెరగని ముద్ర: రాహుల్‌
స్టీఫెన్‌ మృతికి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సంతాపం ప్రకటించారు. తర్కం, ప్రజ్ఞ, శాస్త్రీయ జిజ్ఞాసలో ఆయన ప్రపంచానికే మార్గదర్శకుడని అన్నారు. ప్రజల జీవితాలపై చెరగని ముద్ర వేశారని ట్వీటర్‌లో పేర్కొన్నారు. శారీరకంగా ఎన్ని అవరోధాలెదురైనా ఆధునిక భౌతిక శాస్త్రంలో ఆయన అత్యంత ప్రముఖుడిగా నిలిచారని తెలిపారు.  

సీఎం కేసీఆర్‌ సంతాపం
సాక్షి, హైదరాబాద్‌: ప్రముఖ భౌతిక, ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్‌ హాకింగ్‌ మరణం పట్ల తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌ రావు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. భౌతిక శాస్త్రంలోని అనేక విషయాలపై అధ్యయనం చేసిన హాకింగ్‌.. మానవాళికి విలువైన సమాచారాన్ని అందించారని కొనియాడారు. శరీరం సహకరించకున్నా, తన మేధోశక్తితో అద్భుత ఆవిష్కరణలు చేసిన హాకింగ్‌ ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తారని కేసీఆర్‌ అన్నారు.  

ఓ మేధావిని కోల్పోయాం: వైఎస్‌ జగన్‌
సాక్షి, అమరావతి: ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త, ప్రొఫెసర్‌ స్టీఫెన్‌ హాకింగ్‌ మృతి పట్ల వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి సానుభూతి ప్రకటించారు. ప్రపంచం ఓ మేధావిని కోల్పోయిందని సంతాప సందేశంలో వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. మరణం తర్వాత జీవితం లేదనీ, స్వర్గం అనేది ఓ కట్టుకథ అన్న హాకింగ్‌ నమ్మకాన్ని, ఆయన రాసిన ‘ఎ బ్రీఫ్‌ హిస్టరీ ఆఫ్‌ టైం’ (కాలం కథ) అనే రచనను జగన్‌ గుర్తుచేశారు. అనారోగ్యంతో బాధపడుతూ, వీల్‌చైర్‌కే పరిమితమైనప్పటికీ సరికొత్త మేధో కోణాన్ని ఆవిష్కరించేందుకు హాకింగ్‌ చేసిన సేవలను జగన్‌ కొనియాడారు. ఆయన ప్రతీ కదలికలో ధైర్యం, కృతనిశ్చయం కనిపించేదన్నారు. విజ్ఞాన శాస్త్ర అవధులను తాకిన ఆయన మేధో సంపత్తికి ఘన నివాళి అర్పించారు.  

ఇంకొన్నాళ్లే అన్నా చదువు కొనసాగించారు..
ఏఎల్‌ఎస్‌ వ్యాధి సాధారణంగా ప్రాణాంతకమైనది. 21 ఏళ్ల వయసులో హాకింగ్‌కు ఈ వ్యాధి ఉందని బయటపడినప్పుడు ఆయన ఇంకొన్నేళ్లు మాత్రమే బతుకుతాడని వైద్యులు చెప్పారు. అయినా ఆయన దాని గురించి ఆలోచించకుండా కేంబ్రిడ్జిలో చదువు కొనసాగించారు. ఏఎల్‌ఎస్‌తో హాకింగ్‌ వీల్‌చైర్‌కి పరిమితమయ్యారు.

ఒక చేతిలోని కొన్ని వేళ్లను మాత్రమే ఆయన కదపగలిగేవారు. ఇతరులు లేదా యంత్రాల సాయం లేకుండా కనీసం మాట్లాడటం సహా ఏ చిన్న పనీ చేసుకోలేని స్థితి. కానీ యంత్రాల సాయంతోనే ఆకట్టుకునేలా మాట్లాడుతూ సంకల్ప బలానికి, ఆసక్తికి ఓ చిహ్నంలా నిలిచారు హాకింగ్‌. 1970లో రోజర్‌ పెన్‌రోస్‌తో కలసి కృష్ణ బిలాలపై హాకింగ్‌ చేసిన పరిశోధనలు తొలిసారి ఆయనకు గుర్తింపును తెచ్చిపెట్టాయి.

                               వ్యాధి సోకినట్లు కనుగొన్న తొలినాళ్లలో భార్యతో...

నోబెల్‌ మినహా.. ఎన్నో అవార్డులు
శాస్త్ర రంగంలో చేసిన పరిశోధనలకుగానూ హాకింగ్‌కి అనేక ప్రతిష్టాత్మక పురస్కారాలు లభించాయి. అల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ అవార్డు, వోల్ఫ్‌ ప్రైజ్, ద కోప్లీ మెడల్, ద ఫండమెంటల్‌ ఫిజిక్స్‌ ప్రైజ్,  కమాండర్‌ ఆఫ్‌ మోస్ట్‌ ఎక్స్‌లెంట్‌ ఆర్డర్‌ ఆఫ్‌ బ్రిటిష్‌ ఎంపైర్,  గోల్డ్‌ మెడల్‌ ఆఫ్‌ రాయల్‌ అస్ట్రోనామికల్‌ సొసైటీ తదితర పురస్కారాలు ఆయనను వరించాయి. హాకింగ్‌ బ్రిటిష్‌ పౌరుడై నప్పటికీ 2009లో ఒబామా అమెరికా అత్యున్నత పౌర పురస్కారం ‘ప్రెసిడెన్షియల్‌ మెడల్‌ ఆఫ్‌ ఫ్రీడమ్‌’తో ఆయనను సత్కరించారు.

తనకు ఏఎల్‌సీ వ్యాధి ఉందని తెలిసినప్పుడు తన ఆలోచన ఎలా ఉండేదో 2013లో ఆయన ఓ సారి చెప్పారు. ‘నాకు ఇలా జరగడం చాలా అన్యాయమని నేను బాధపడ్డాను. నా జీవితం ఇక అయిపోయిందనీ, నాలోని శక్తి సామర్థ్యాలు వృథా అని అనుకున్నాను. కానీ ఇప్పుడు, 50 ఏళ్ల తర్వాత, నా జీవితంతో నేను పూర్తి సంతృప్తిగా ఉన్నాను’ అని ఆయన పేర్కొన్నారు. 2014లో స్టీఫెన్‌ హాకింగ్‌ జీవితంపై ‘ద థియరీ ఆఫ్‌ ఎవ్రీథింగ్‌’ అని సినిమా కూడా తీశారు. ఈ సినిమాలో స్టీఫెన్‌ పాత్ర పోషించిన రెడ్‌మేన్‌కు ఆస్కార్‌ అవార్డు లభించింది.

                        మెడల్‌ ఆఫ్‌ ఫ్రీడమ్‌తో సత్కరిస్తున్న ఒబామా

నోబెల్‌ మాత్రం అందలేదు
భౌతిక శాస్త్రం మౌలిక సూత్రాలతో విశ్వాంతరాళంలోని వస్తువులు, వాటి ఉనికిపై విశేష పరిశోధనలు చేసిన స్టీఫెన్‌ హాకింగ్‌కు నోబెల్‌ బహుమతి అందని ద్రాక్షగానే మిగిలింది. జీవితంలో ఒక్కసారైనా పొందాలని శాస్త్రవేత్తలు కలలు గనే ఆ అరుదైన గౌరవం హాకింగ్‌కు ఎందుకు దక్కలేదు? కృష్ణ బిలాలు అంతరించిపోతాయన్న ఆయన ప్రతిపాదన నిరూపణ కాకపోవడమే ఇందుకు కారణమని భావిస్తున్నారు. అయితే కృష్ణ బిలాలపై హాకింగ్‌ పరిశోధనలను ప్రస్తుతం సైద్ధాంతిక భౌతికశాస్త్రంలో ఆమోదిస్తున్నారు.

మరిన్ని వార్తలు