భీకరకాల్పులు.. 32 మంది తీవ్రవాదులు హతం

18 May, 2017 19:27 IST|Sakshi

డమాస్కస్‌(సిరియా): సిరియా సైన్యానికి, ఐఎస్‌ తీవ్రవాదులకు మధ్య జరిగిన భీకర కాల్పుల్లో 49 మంది ప్రాణాలు కోల్పోయారు. నాలుగు రోజుల క్రితం అలెప్పో సమీపంలోని అల్‌జర్రా మిలిటరీ స్థావరాన్ని ఐఎస్‌ తీవ్రవాదులు స్వాధీనం చేసుకున్నారు. దానిని తిరిగి స్వాధీనం చేసుకునే క్రమంలో ఆ దేశాధ్యక్షుడు బషర్‌ అల్‌ అస్సాద్‌కు విధేయంగా ఉన్న దళాలు ముమ్మర ప్రయత్నాలు ప్రారంభించాయి. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య హోరాహోరీగా కాల్పులు జరిగాయి.

ఆర్మీ స్థావరాన్ని దక్కించుకునే క్రమంలో 49 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సిరియా అబ్జర్వేటరీ ఫర్‌ హ్యూమన్‌ రైట్స్‌(ఎస్‌వోహెచ్‌ఆర్‌) ప్రకటించింది. 17మంది సైనికులు అమరులు కాగా, 32 మంది ఐఎస్‌ తీవ్రవాదులు అంతమయ్యారని పేర్కొంది. కాగా, సిరియా సైన్యం అల్‌ జిర్రా ఎయిర్‌బేస్‌ చుట్టుపక్కలున్న 12 పట్టణాలను తిరిగి వశం చేసుకోవడం శుభపరిణామం. అయితే ఐసిస్‌ను అంతం చేసేంతవరకు అక్కడ తమ పోరు ఆగదని ఆర్మీ ఉన్నతాధికారి తెలిపారు.
 

మరిన్ని వార్తలు