ఉమ్మడి పోరుతోనే ఉగ్ర వినాశనం

11 Jul, 2016 01:35 IST|Sakshi
ఉమ్మడి పోరుతోనే ఉగ్ర వినాశనం

- నైరోబీలో ప్రధాని మోదీ
- 20 వేలమందితో కిక్కిరిసిన స్టేడియం
 
 నైరోబీ : ప్రపంచం ఎదుర్కొంటున్న రెండు ప్రధాన సమస్యల్లో ఉగ్రవాదం ఒకటని, మానవత్వాన్ని విశ్వసించే శక్తులన్నీ కలిసికట్టుగా ఉగ్రవాదాన్ని ఓడించేందుకు ముందుకు రావాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కెన్యా రాజధాని నైరోబీలోని కాసరాని స్టేడియంలో ఆదివారం రాత్రి 20 వేల మంది భారతీయుల్ని, భారత సంతతి ప్రజల్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.  దాదాపు గంట పాటు ఆయన ప్రసంగిస్తున్నంత సేపు మోదీ, మోదీ నినాదాలతో స్టేడియం మార్మోగింది.

 ‘ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఉన్నా భారత్ ప్రగతిలో దూసుకెళ్తోంది. ప్రస్తుతం 7.6  శాతం వృద్ధి రేటుతో ముందుకెళ్తోంది. మేం ఇక్కడితో ఆగిపోం. ముందుకు వెళ్తాం. 8 శాతం వృద్ధి రేటుకు చేరుకుంటాం.  ప్రపంచం ఎదుర్కోంటున్న రెండు ప్రధాన సమస్యలు ఉగ్రవాదం, గ్లోబల్ వార్మింగ్‌లు. వీటిని ఎదుర్కొనేందుకు ప్రపంచం మొత్తం కలిసికట్టుగా ముందుకు రావాలి. వేగంగా ముందుకొస్తే... త్వరగా ఉగ్రవాదం అంతమవుతుంది. వాతావరణ మార్పు సమస్యకు పరిష్కారం చూపాల్సిన సమయం వచ్చినప్పుడు భారత్ మార్గం చూపుతుంది. 2014 లోక్‌సభ ఎన్నికల సమయంలో చిన్న రాష్ట్రమైన గుజరాత్‌కు చెందిన వ్యక్తి ప్రధానిగా ఏం చేయగలరని విమర్శకులు ప్రశ్నించారు. నా సామర్థ్యంపై అనేక ప్రశ్నలు వ్యక్తమయ్యాయి.

విదేశీ వ్యవహారాల్లో నాకు ఎలాంటి పరిజ్ఞానం లేదంటూ విమర్శించారు. అవి నిజం కూడా.. ప్రధాన మంత్రి అయ్యాకే నేను పార్లమెంట్‌ను చూశాను. గత రెండేళ్ల పాలనలో భారతదేశం మంచి పాలన చూసింది.. గతంలో వలే కాకుండా పథకాలు సమర్థంగా అమలయ్యాయి. గత రెండేళ్లలో దేశంలోని చాలా ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం నమోదైంది. అందుకే తాగునీటి కోసం రైళ్లను నడిపాం. స్పష్టంగా దేవుడు కూడా నాకు పరీక్ష పెట్టాడు. మంచి పాలనకు, పౌరుల జీవితాల్లో మార్పు తీసుకొచ్చేందుకు మేం ప్రోత్సాహం అందించాం. 125 కోట్ల మంది ప్రజలు ముందుకెళ్లానని తీర్మానించుకున్నట్లు నేను గుర్తించాను. ఇది నిజమైన ప్రజా శక్తి. ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్, ఇతర రేటింగ్ సంస్థలు భారత్‌ను మంచి భవిష్యత్తు ఉన్న దేశంగా పేర్కొంటున్నాయి. ఇదంతా అకస్మాత్తుగా జరగలేదు. గత రెండేళ్లలో ఒక దాని వెంట ఒకటి ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్లే ఇది సాధ్యమైంది’ అని ప్రధాని అన్నారు. ఈ కార్యక్రమంలో మోదీతో పాటు కెన్యా అధ్యక్షుడు ఉహురు కెన్యాట్టా కూడా పాల్గొన్నారు.
 
 టాంజానియాతో ఐదు ఒప్పందాలు
 దారెస్సలాం : టాంజానియాతో సంబంధాలు మరింత బలోపేతంతో పాటు, ఆ దేశాభివృద్ధికి అవసరమైన పూర్తి సాయం అందించేందుకు భారత్ ముందుకొచ్చింది. ప్రధాని నరేంద్రమోదీ టాంజానియా పర్యటన సందర్భంగా ఆదివారం ఈ మేరకు ఐదు ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. టాంజానియా అభివృద్ధిలో భారత్‌ను నమ్మకమైన భాగస్వామిగా అభివర్ణించిన ప్రధాని... ఆ దేశాధ్యక్షుడు జాన్ పాంబే మగుఫులితో కలసి రక్షణ, భద్రతా సహకారం, సముద్ర రవాణా రంగాల్లో సహకారాన్ని మరింత విస్తృత పరచుకోవాలని నిర్ణయించారు.  జాంజిబార్ నీటి సరఫరా  వ్యవస్థకు రూ. 617 కోట్ల రుణ సాయంపై ఇరు దేశాల ప్రతినిధులు సంతకాలు చేశారు.

నీటి వనరుల నిర్వహణ, అభివృద్ధి, జాంజిబార్‌లో వృత్తి విద్య శిక్ష ణ కేంద్రం ఏర్పాటు, దౌత్య, అధికారిక పాస్‌పోర్ట్ ఉంటే వీసా నిబంధనలో వెసులుబాటుపై ఒప్పందాలు కుదుర్చుకున్నారు. రెండు దేశాలు వ్యవసాయం, ఆహార భద్రత వంటి అంశాల్లో భాగస్వామ్యాన్ని మరింత పెంచుకోవాలని మోదీ అన్నారు. పప్పుదినుసుల్ని టాంజానియా నుంచి భారత్‌కు ఎగుమతి చేసే అంశంపైనా చర్చించారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో మోదీ, టాంజానియా అధ్యక్షుడితో కలిసి డ్రమ్స్ వాయిస్తూ ఉత్సాహంగా కన్పిం చారు. తర్వాత మోదీ కెన్యాకు వెళ్లారు.

మరిన్ని వార్తలు