ఆ తొమ్మిది రాష్ట్రాలే కీలకం

6 Nov, 2016 01:25 IST|Sakshi
ఆ తొమ్మిది రాష్ట్రాలే కీలకం

- రెండు రోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు
- వరుస ర్యాలీలతో హోరెత్తిస్తున్న హిల్లరీ, ట్రంప్  తాజా సర్వేల్లో హిల్లరీకే ఆధిక్యం
 
 ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోన్న అమెరికా అధ్యక్ష ఎన్నికలకు రెండ్రోజులే సమయముంది. ఇంతవరకూ జరిగిన ప్రచారం ఒక ఎత్తై ఈ రెండ్రోజుల ప్రచారం మరో ఎత్తు... 3 వారాల క్రితం వరకూ హిల్లరీ గెలుపు ఖాయమన్న సర్వేలు... తాజాగా పోరు హోరాహోరీ అని చెప్పడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. హిల్లరీకే కొద్దిపాటి ఆధిక్యం కట్టబెట్టినా చివరి నిముషం వరకూ ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ. దీంతో గెలుపు కోసం డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ చివరి అస్త్రాలు ప్రయోగిస్తున్నారు. తమకు పట్టున్న రాష్ట్రాల్ని పక్కన పెట్టి... విజేతను నిర్ణయించే రాష్ట్రాలపై సర్వశక్తులు ఒడ్డుతున్నారు.           
- సాక్షి, నేషనల్ డెస్క్
 
 120 ఎలక్టోరల్ ఓట్లపై ఊగిసలాట
 ఫ్లోరిడా, ఒహయో, నెవెడా, పెన్సిల్వేనియా, మిచిగన్, కొలరాడో, వర్జీనియా, అయోవా, న్యూహ్యాంప్‌షైర్ రాష్ట్రాల్లో ఎక్కువ ఎవరు గెలిస్తే వారిదే అమెరికా అధ్యక్ష పీఠం. అన్ని రాష్ట్రాల్లో కలిపి 538 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ఉండగా  ఈ 9 రాష్ట్రాల్లో 120 ఓట్లు ఉన్నాయి. దీంతో హిల్లరీ, ట్రంప్‌లు కీలక రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలు, ర్యాలీలతో ఊదరగొట్టేస్తున్నారు. పెన్సిల్వేనియా, మిచిగన్, ఒహయోలపై హిల్లరీ ఆశలు పెట్టుకున్నారు. ట్రంప్ వర్గం కూడా న్యూ హ్యాంప్‌షైర్, ఒహయో, పెన్సిల్వేనియా తమదేనంటున్నారు.

 ఒహయోలో ట్రంప్, పెన్సిల్వేనియాలో హిల్లరీ!: కచ్చితమైన సర్వేలు ఇవ్వడంలో దిట్టైన రియల్ క్లియర్ పాలిటిక్స్ నవంబర్ 4న వెల్లడించిన వివరాల ప్రకారం... ఒహయోలో ట్రంప్ ఆధిక్యంలో ఉండగా... పెన్సిల్వేనియాలో హిల్లరీ మెజారిటీలో కొనసాగుతున్నారు. ఇప్పటికే ఒహయో, పెన్సిల్వేనియాలో ఇద్దరు అభ్యర్థులు వరుస ర్యాలీలు నిర్వహించారు. న్యూహ్యాంప్‌షైర్‌లో ట్రంప్, మిచిగన్‌లో హిల్లరీలు ప్రచారంతో హోరెత్తించారు. చివరి నాలుగు రోజుల్లో ప్రముఖ గాయకులు, సినీతారలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. శనివారం(భారత కాలమానం) ఒహయో, పెన్సిల్వేనియాలో హిల్లరీతో పాటు గాయకురాలు బేయోన్స్ అతని భర్త, గాయకుడు జే జెడ్‌లు పాల్గొన్నారు. యువతను, మైనారిటీల ఓటర్లను ఆకర్షించేందుకు క్లింటన్ శిబిరం పలువురు ప్రముఖులతో కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ట్రంప్ మాత్రం వీటికి దూరంగా సొంతగానే ప్రచారం చేస్తున్నారు.

 ఊగిసలాటలో ఫ్లోరిడా ఓటరు
 అయితే ఇద్దరి అసలు లక్ష్యం ఫ్లోరిడా... 2000 సంవత్సరంలో అమెరికా అధ్యక్ష ఫలితాన్ని తారుమారు చేసింది కూడా ఈ రాష్ట్రమే... ఫ్లోరిడాలో మొత్తం 29 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. మంగళవారం జరిగే ఎన్నికల ఫలితాల్ని కూడా ఫ్లోరిడా నిర్ణయిస్తుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఇంతవరకూ కచ్చితంగా ఈ రాష్ట్ర ఓటర్లు ఎవరివైపు మొగ్గుచూపలేదు. హిల్లరీ గెలవకపోయినా ఫ్లోరిడాలో ట్రంప్ గెలుపు తప్పనిసరి. ట్రంప్ గెలిస్తే అధ్యక్ష పీఠం ఖాయమని చెపుతున్నారు. చివరి రెండు రోజులు ట్రంప్, హిల్లరీలు ఈ రాష్ట్రంలో వరుస ర్యాలీల్లో పాల్గొంటారు. అలాగే నార్త్ కరోలినా, నెవెడాల్లో కూడా ట్రంప్ పర్యటిస్తారు. తాజా ఒపీనియన్ పోల్స్ ప్రకారం ఫ్లోరిడాలో ట్రంప్ బలం పెరిగినా హిల్లరీ కంటే వెనుకంజలోనే ఉన్నారు. రియల్ క్లియర్ పాలిటిక్స్ ప్రకారం... ఫ్లోరిడాలో హిల్లరీ కొద్దిపాటి ఆధిక్యంలో కొనసాగుతుండగా... ఫైవ్‌థర్టీఎయిట్ వైబ్‌సైట్ విశ్లేషణ మేరకు 52.4 శాతంతో ట్రంప్‌కు గెలుపు అవకాశాలున్నాయి. 2012 ఎన్నికల్లో ఫ్లోరిడాలో బరాక్ ఒబామా కేవలం 0.9 శాతం ఓట్లతో రిపబ్లికన్ మిట్ రోమ్నీపై గెలుపొందారు.

 ఫ్లోరిడాలో ట్రంప్‌కు వలస ఓటర్ల మద్దతు
 ఫ్లోరిడాలో ఎక్కువగా ఉండే లాటిన్ వలస ఓటర్ల మద్దతు హిల్లరీకి అత్యంత కీలకం. ఆ ఉద్దేశంతోనే ఫ్లోరిడా తమదేనని డెమోక్రాట్లు అంచనా వేశారు. వలసవాదులకు వ్యతిరేకంగా ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు తమకు కలిసొస్తాయని భావించారు. అయితే ఫ్లోరిడాలో కొద్దిమంది లాటిన్లు ట్రంప్ వైపు మొగ్గు చూపడం విశేషం. దాదాపు 16 శాతం మంది రిపబ్లికన్ పార్టీకి మద్దతిస్తున్నట్లు సమాచారం. మొదటి నుంచి ఫ్లోరిడాలో స్పానిష్ మాట్లాడే ప్రజల్లో ఎక్కువ మంది డెమోక్రాట్లే. క్యూబా వలస ఓటర్లు మాత్రం సంప్రదాయంగా రిపబ్లికన్ పార్టీకి ఓటేస్తున్నారు.

 ట్రంప్ భార్యపై ఆరోపణలు.. ట్రంప్ భార్య మెలేనియాపై తాజాగా ఆరోపణలు వెల్లవెత్తాయి. రెండు దశాబ్దాల క్రితం మోడలింగ్ చేసేందుకు అమెరికాలో అక్రమంగా కొద్ది కాలం ఉన్నట్లు కొన్ని పత్రాలు వెలుగు చూశాయి. ట్రంప్‌తో తనకున్న సంబంధాల వివరాలు వెల్లడిస్తే ప్లేబాయ్ పత్రిక మాజీ మోడల్‌కు అమెరికా టాబ్లాయిడ్ ద నేషనల్ ఎంక్వైరర్ రూ. కోటికి పైగా ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు మరో వివాదం వెలుగు చూసింది.
 
 ఆమెకే పట్టం!
 హిల్లరీ ఈమెయిల్స్ వివాదంతో ట్రంప్ ఆధిక్యంలోకి దూసుకొచ్చినా తాజా సర్వేలు, ఒపీనియన్ పోల్స్ మాత్రం హిల్లరీకే ఆధిక్యం కట్టబెట్టాయి. తాజాగా(నవంబర్ 5) ఫాక్స్ న్యూస్ నిర్వహించిన సర్వేలో రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ కంటే డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ రెండు పాయింట్ల ఆధిక్యంలో ఉన్నారు.  ట్రంప్‌కు 43 శాతం, హిల్లరీకి 45 శాతం మంది మద్దతు పలికారు. వారం క్రితం ఫాక్స్ న్యూస్ సర్వేలో హిల్లరీ మూడు పాయింట్ల ఆధిక్యంలో కొనసాగగా... అక్టోబర్ మధ్యలో ఆ తేడా 6 పాయింట్లకు పైనే...  
► సీఎన్‌ఎన్ తాజా పోల్ ప్రకారం హిల్లరీ 268 ఎలక్టోరల్ ఓట్లు గెలుచుకోవచ్చు. అమెరికా అధ్యక్ష పీఠం ఎక్కాలంటే 270 ఎలక్టోరల్ ఓట్లు అవసరం. ట్రంప్‌కు మాత్రం 204 ఎలక్టోరల్ ఓట్లే వస్తాయని తేల్చింది. మిగతా 66 ఓట్లకు హోరాహోరీ పోరు సాగవచ్చని పేర్కొంది. సీఎన్‌ఎన్ ప్రకారం అరిజోనా, ఫ్లోరిడా, నెవెడా, న్యూ హ్యాంప్‌షైర్, నార్త్ కరోలినా, ఒహయోలో పోటాపోటీ ఉంటుంది. గత రెండు వారాల్లో ట్రంప్ కొద్ది పాటి ఆధిక్యం సాధించారని సీఎన్‌ఎన్ వెల్లడించింది.
► ఇక రియల్ క్లియర్ పాలిటిక్స్ ప్రకారం... ట్రంప్ కంటే హిల్లరీ 1.6 శాతం ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.  
► న్యూయార్క్ టైమ్స్ అంచనా మేరకు క్లింటన్‌కు 67.8 శాతం గెలుపు అవకాశాలున్నట్లు తేలింది.      
► బీబీసీ న్యూస్ ఇంతవరకూ నిర్వహించిన సర్వేల సరాసరిలో హిల్లరీనే ఆధిక్యంలో ఉన్నారు. హిల్లరీకి 46 శాతం, ట్రంప్‌కు 44 శాతం ఓట్లు దక్కాయి.
► హఫింగ్టన్ పోస్టు అంచనా ప్రకారం హిల్లరీకి 97.9 శాతం విజయావకాశాలుండగా, ప్రిన్స్‌టన్ ఎలక్షన్ కన్సార్టియం క్లింటన్‌కు భారీ మెజారిటీ కట్టబెట్టింది. ప్రముఖ సర్వే సంస్థలు ఫైవ్‌థర్టీఎయిట్, టాకింగ్‌పాయింట్‌మెమో(టీపీఎం)లు హిల్లరీకి 1 నుంచి 3 పాయింట్ల వరకూ ఆధిక్యం కట్టబెట్టాయి.

మరిన్ని వార్తలు