ఒబామా నుంచి మలాలా దాకా..

20 Apr, 2015 03:59 IST|Sakshi
ఒబామా నుంచి మలాలా దాకా..
  • ‘టైమ్’ మేగజీన్ 100 మంది ప్రభావశీలుర జాబితాలో మోదీ సహా మహామహులు
  • ‘భారతదేశపు సంస్కరణల సారథి’గా ప్రధాని నరేంద్రమోదీ ప్రపంచంలో అత్యంత ప్రభావశీలురైన 100 మందిలో ఒకరిగా ‘టైమ్ మేగజీన్’లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వ్యాసం రాయటం.. భారత ప్రధానికి దక్కిన అరుదైన గౌరవంగా పరిగణిస్తున్నారు. అమెరికాలోని న్యూయార్క్ నుంచి ప్రచురితమవుతున్న ప్రఖ్యాత అంతర్జాతీయ వారపత్రిక టైమ్ మేగజీన్. 1923 లో మొదలైన ఈ మేగజీన్ అమెరికాలో తొలి వార్తా వారపత్రిక. లండన్ నుంచి యూరోపియన్ ఎడిషన్, హాంగ్‌కాంగ్ నుంచి ఏసియన్ ఎడిషన్, సిడ్నీ నుంచి సౌత్ పసిఫిక్ ఎడిషన్‌లను ప్రచురిస్తోంది. ప్రపంచంలో అత్యంత పాఠకాదరణ ఉన్న మేగజీన్ ఇదే.

    రెండున్నర కోట్ల మంది దీన్ని చదువుతారు. అందులో రెండు కోట్ల మంది  అమెరికాలోనే ఉన్నారు. టైమ్ మేగజీన్ 1999లో తొలిసారి 20వ శతాబ్దపు 100 మంది అత్యంత ప్రభావశీలుర జాబితాను సర్వే ద్వారా ప్రకటించింది. అప్పటి నుంచీ ప్రతి ఏడాదీ ఆ ఏడాదికి సంబంధించి ప్రపంచంలో అత్యంత ప్రభావశీలుర జాబితాను ప్రచురిస్తోంది. రాజకీయాలు, వ్యాపారం, కళలు తదితర రంగాల్లో ప్రభావశీలురను ఎంపిక చేస్తోంది.  2015లో ప్రపంచంలో అత్యంత ప్రభావశీలురైన 100 మంది వ్యక్తుల గురించి.. వారి వారి రంగానికి చెందిన ఇతర ప్రముఖుల చేత పరిచయం చేయించటం విశేషం.
     

    • ఆయా దేశాల ప్రజల సంఖ్యను బట్టి ప్రభావవంతమైన దేశాధ్యక్షులుగా.. భారత ప్రధాని మోదీతో పాటు అమెరికా అధ్యక్షుడు ఒబామా, రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తదితరులను ఎంపిక చేశారు. పోప్ ఫ్రాన్సిస్, క్యూబా అధ్యక్షుడు రౌల్ కాస్ట్రో, ఇజ్రాయెల్ పాలకుడు బెంజమిన్ నెతన్యాహు పేర్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.
    • ఆయా కంపెనీల ఉత్పత్తులను వాడే వారి సంఖ్యను బట్టి ప్రభావశీలురను ఎంపిక చేశారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, యాపిల్ సీఈఓ టిమ్ కుక్, లింక్‌డ్‌ఇన్ సీఈఓ రీడ్ హాఫ్‌మన్, ఐసీఐసీఐ బ్యాంక్ సీఈఓ చందా కొచ్చర్ తదితరుల పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.
    • ఫేస్‌బుక్‌లో అభిమానుల సంఖ్యను బట్టి వివిధ కళా రంగాలకు చెందిన ప్రభావవంతమైన ప్రముఖ తారలను ఎంపిక చేశారు. ఎమ్మా వాట్సన్, కిమ్ కర్దషియన్, కెవిన్ హార్ట్, బ్రాడ్లీ కూపర్, రీస్ విదర్‌స్పూన్ పేర్లను ఎంపిక చేశారు. ఆరోగ్య రంగంలో భారత్ నుంచి మానసిక వైద్య చికిత్సా నిపుణుడు విక్రమ్‌పటేల్ పేరు కూడా ఇందులో చోటు సంపాదించుకుంది.  
    • భారత ప్రధాని మోదీని పరిచయం చేసిన ఒబామాను ప్రపంచంలో అత్యంత ప్రభావశీలుడిగా పేర్కొంటూ టైమ్ మేగజీన్ రాజకీయ వ్యాసరచయిత జో క్లీన్ రాశారు.
    • ఉత్తరకొరియా ‘పీడకుడు’ అంటూ ఆ దేశాధిపతి కిమ్ జాంగ్ ఉన్ గురించీ రాశారు.  
    • జాబితాలో అత్యంత పిన్న వయస్కురాలిగా పాకిస్తాన్‌కు చెందిన బాలికల విద్యా ఉద్యమ కార్యకర్త, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్ జాయ్ (17) మరో రికార్డు సృష్టించారు.
మరిన్ని వార్తలు