భారత్‌కు పెరిగిన యూఎస్‌ వీసాలు

30 May, 2017 01:03 IST|Sakshi
భారత్‌కు పెరిగిన యూఎస్‌ వీసాలు

పాక్‌కు భారీ కోత
ఇస్లామాబాద్‌: ట్రంప్‌ ప్రభుత్వం వచ్చాక భారత్‌కు నాన్‌ ఇమ్మిగ్రెంట్‌ వీసాల జారీ పెరిగింది. తాజాగా విడుదల చేసిన అధికారిక సమాచారంలో.. భారత జాతీయులకు వీసాల్లో 28 శాతం పెరుగుదల కనిపిస్తోంది. మరోవైపు అమెరికా విధించిన ట్రావెల్‌ బ్యాన్‌ దేశాల్లో పాకిస్తాన్‌ లేకపోయినా ఆ దేశీయులకు వీసాల్లో మాత్రం భారీ కోత పెట్టారు. గతేడాది మార్చి, ఏప్రిల్‌లతో పోలిస్తే ఈ ఏడాది అవే నెలల్లో నాన్‌ ఇమ్మిగ్రెంట్‌ వీసాల్లో పాక్‌ జాతీయులకు 40 శాతం తగ్గించారు.

ఈ వివరాలను పాక్‌ మీడియా సోమవారం వెల్లడించింది. గతేడాది ఒబామా పాలనలో పాక్‌ జాతీయులకు 78,637 వీసాలు జారీ అయ్యాయి. దీన్ని బట్టి చూస్తే నెలకు సరాసరి 6,553 వీసాలు. అయితే ఈ ఏడాది మార్చిలో 3,973, ఏప్రిల్‌లో 3,925 వీసాలు జారీ చేశారు. ఇక భారతీయులకు ఒబామా సర్కార్‌ గతేడాది 8,64,987 వీసాలు జారీచేసింది.

ఆ ఏడాదిలో సరాసరి నెలకు 72,082 వీసాలు. కాగా, ఈ ఏడాది మార్చిలో భారత జాతీయులకు 87,049, ఏప్రిల్‌లో 97,925 వీసాలు ట్రంప్‌ ప్రభుత్వం జారీ చేసింది. అయితే మొత్తంగా చూస్తే పాకిస్తానే కాకుండా ముస్లిం దేశాలకు వీసాల జారీల్లో అమెరికా భారీ కోత పెట్టింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏప్రిల్‌ నెలలో 20 శాతం వీసాలు తగ్గించారు. ఇక ట్రావెల్‌ బ్యాన్‌ ఎదుర్కొంటున్న ఇరాన్, సిరియా, సూడాన్, సోమాలియా, లిబియా, యెమెన్‌ దేశాలకు జారీ చేసిన వీసాల్లో 55 శాతం తగ్గుదల కనిపిస్తోంది.

మరిన్ని వార్తలు