‘అమెరికాకు అతిపెద్ద శత్రువులు మీరే’

14 Jun, 2018 12:27 IST|Sakshi
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (పాత ఫొటో)

మీడియాపై ట్రంప్‌ ఆగ్రహం

వాషింగ్టన్‌ : ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌తో జరిగిన చారిత్రాత్మక భేటీ గురించి అమెరికన్‌ మీడియా తప్పుడు వార్తలు ప్రచారం చేసిందంటూ డొనాల్డ్‌ ట్రంప్‌ మండిపడ్డారు. సింగపూర్‌ నుంచి తిరిగి వచ్చిన వెంటనే ట్విటర్‌ వేదికగా మీడియాపై అసహనం వ్యక్తం  చేశారు.

‘ముఖ్యంగా ఎన్‌బీసీ, సీఎన్‌ఎన్‌ వంటి మీడియా సంస్థలు ప్రచారం చేసే నకిలీ వార్తలు చూస్తుంటే నవ్వొస్తుంది. ఉత్తర కొరియాతో జరిగిన ఒప్పందం గురించి తక్కువ చేసి చూపించడానికి వారు ఎంతో కష్టపడ్డారు. .. ఈ ఒప్పందం జరగాలంటూ 500 రోజుల క్రితం ఏదో ఉపద్రవం ముంచుకొస్తుందా అన్న స్థాయిలో గగ్గోలు పెట్టిన వారే ఇప్పుడు ఈవిధంగా వ్యవహరిస్తున్నారు. తప్పుడు వార్తలు ప్రచారం చేసే వారే మన దేశానికున్న అతిపెద్ద శత్రువులంటూ’  ట్రంప్‌ ట్వీట్‌ చేశారు.   

భేటీ అనంతరం అణు నిరాయుధీకరణకు ఉత్తర కొరియా సమ్మతించిన నేపథ్యంలో భారీ అణు విపత్తునుంచి ప్రపంచం ఒక అడుగు వెనక్కు వేయగలిగిందని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. అయితే ఈ అంశంపై కొందరు ‘నిపుణులు’ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

భావప్రకటనా స్వేచ్ఛను హరించినట్లే..
ట్రంప్‌ ట్వీట్‌పై న్యూయార్క్‌ యూనివర్సిటీ జర్నలిజం ప్రొఫెసర్‌ జే రోసన్‌ స్పందించారు. ‘వాస్తవాలను తొక్కిపెట్టాలనే ప్రయత్నమే ఇది. ఒకవేళ నిజాలను అంగీకరించలేకపోతే.. ఈ ప్రపంచంలో వివాదాలు తప్ప నిజమనేదే ఉండదు. జవాబుదారీతనం కూడా ఉండదు. భావప్రకటనా స్వేచ్ఛకు ఇది పూర్తి విరుద్ధం’ అంటూ వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు