గొర్రె పిల్లను కాపాడబోయి కాపరి మృతి

14 Jun, 2018 12:25 IST|Sakshi
బావిలో రాజయ్య మృతదేహం

రామకృష్ణకాలనీలో ఘటన

తాడుతో పైకిలాగి గొర్రెను కాపాడిన రాజయ్య

అదే తాడుసాయంతో పైకి వస్తుండగా జారిపడి మృతి

కళ్లెదుటే తండ్రి మృతితో మిన్నంటిన తనయుల రోదనలు

సాక్షి, అల్గునూర్‌(మానకొండూర్‌) :  ఉపాధి పొందు తున్న గొర్రెను కాపాడబోయి గొర్రెల కాపరి ప్రాణాలు కోల్పోయిన ఘటన తిమ్మాపూర్‌ మండలం రామకృష్ణకాలనీలో బుధవారం చోటు చేసుకుంది. రామకృష్ణకాలనీ పంచాయతీ పరిధిలోని చర్లపల్లికి చెందిన ఆవుల రాజయ్య(45) గొర్రెలు పెంచుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రోజువారీలాగే బుధవారం ఉదయం గొర్రెలను మేపెందుకు గ్రామశివారుకు తీసుకెళ్లాడు. మధ్యాహ్నం ఓ గొర్రెపిల్ల మేత కోసం సమీపంలోని బావిదగ్గరకు వెళ్లి.. అందులోనే పడిపోయింది. గమనించిన రాజయ్య వెంటనే తన కొడుకులకు ఫోన్‌ చేయగా.. వారు తాడు తీసుకొచ్చారు. తాడుసాయంతో బావిలోకి దిగిన రాజయ్య మొదట గొర్రెపిల్లను పైకి పంపించాడు. తర్వాత అదే తాడుసాయంతో పైకి వస్తుండగా అదుపుతప్పి పడిపోయాడు. తాడును నడుముకు కట్టుకోవడంతో బావిలోనే తిరుగుతూ బావి అంచులకు తాకడంతో తీవ్రంగా గాయాలయ్యాయి. బావిలో నీళ్లు లేకపోవడం కూడా గాయాల తీవ్రతకు కారణమయ్యాయి. బావిలో పడ్డ తండ్రిని ఎంత పిలిచినా స్పందన రాకపోవడంతో వెంటనే గ్రామస్తులు, బంధువులకు సమాచారం ఇచ్చారు. బావిలో  ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న తండ్రిని కాపాడాలంటూ తనయులిద్దరూ బతిమిలాడుతూ రోదించడం కలచివేసింది. గ్రామస్తులు బావి వద్దకు చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. పోస్ట్‌మార్టం కోసం కరీంనగర్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు.

 
ఆరు నెలల క్రితం విద్యుదాఘాతం
ఆరు నెలల క్రితం రాజయ్యకు చెందిన 18 గొర్రెలు విద్యుదాఘాతంతో మృతిచెందాయి. ఆ సమయంలోనే రాజయ్యకు సైతం కరెంట్‌షాక్‌ రాగా త్రుటిలో తప్పించుకున్నారు. ఆ సమయంలో ఆర్థికంగా చాలా నష్టపోయాడు. ఆరు నెలల తర్వాత ఉపాధి పొందుతున్న గొర్రెలను కాపాడబోయి ప్రాణాలు పోగొట్టుకోవడం గ్రామస్తులను కలచివేసింది. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. నిరుపేద రాజయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు