భారత్‌పై పాక్‌ నిషేధం; గందరగోళం

29 Aug, 2019 14:31 IST|Sakshi

ఇస్లామాబాద్‌: తమ గగనతలం నుంచి భారత విమానాలు వెళ్లకుండా పాకిస్తాన్‌ నిషేధం విధించిందా, లేదా అనే దానిపై గందరగోళం కొనసాగుతోంది. గగనతల నిషేధంపై పాకిస్తాన్‌ మంత్రులు ఇద్దరు భిన్న ప్రకటనలు చేయడంతో అయోమయ పరిస్థితి నెలకొంది. తమ గగనతలం నుంచి భారత విమానాలు వెళ్లకుండా ఇంకా నిషేధం విధించలేదని పాక్‌ విదేశాంగ మంత్రి షా మహ్మద్‌ ఖురేషి బుధవారం తెలిపారు. ఇటువంటి నిర్ణయం ఏదైనా తీసుకునే ముందు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటామన్నారు. భారత్‌ విమానాలు వెళ్లకుండా తమ గగనతలాన్ని మూసివేసినట్టు వచ్చిన వార్తలను ఆయన తోసిపుచ్చారని ‘డాన్‌’ పత్రిక వెల్లడించింది. ఇటీవల జరిగిన ఫెడరల్‌ మంత్రివర్గ సమావేశంలోనూ ఈ అంశం చర్చకు రాలేదని, దీనిపై ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ తుది నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.  

తమ గగనతలాన్ని భారత్‌ ఉపయోగించుకోకుండా సంపూర్ణ నిషేధం విధించాలని తమ దేశం భావిస్తున్నట్టు పాకిస్తాన్‌ శాస్త్ర, సాంకేతిక మంత్రి ఫవాద్‌ చౌద్రీ మంగళవారం ట్వీట్‌ చేయడంతో కలకలం రేగింది. అఫ్గానిస్తాన్‌కు వెళ్లే భారత వాణిజ్య విమానాలను కూడా రద్దు చేస్తామని ఆయన పేర్కొన్నారు. దీంతో భారత్‌కు పాక్‌ గగనతల దారులను మూసివేసిందని మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఎటువంటి నిషేధం విధించలేదని పాక్‌ విదేశాంగ మంత్రి షా మహ్మద్‌ ఖురేషి ప్రకటనతో స్పష్టమైంది. బాలాకోట్‌ వైమానిక దాడికి ప్రతీకారంగా ఫిబ్రవరిలో పాకిస్తాన్‌ గగనతల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. నాలుగున్నర నెలల తర్వాత జూలై 16న నియంత్రణలను పూర్తిగా ఎత్తివేయడంతో భారత్‌, పాకిస్తాన్‌ల మధ్య విమాన సర్వీసులు పునఃప్రారంభమయ్యాయి.

కరాచీ గగనతలం మూసివేత
కరాచీ మీదుగా వెళ్లే మూడు గగనతల దారులను మూసివేస్తున్నట్లు పాకిస్తాన్‌ ప్రకటించింది. ఈ మేరకు బుధవారం నోటీస్‌ టు ఎయిర్‌మెన్‌ (నోటమ్‌) జారీ చేసింది. ఈ నిషేధం అన్ని అంతర్జాతీయ విమాన సంస్థలకు వర్తించనుందని పాక్‌ విమానయాన అధికారులు స్పష్టం చేశారు. ఆగస్టు 28 నుంచి 31 వరకు నాలుగు రోజులపాటు కొనసాగనున్న ఈ నిషేధ సమయంలో విమానాలు కరాచీ మీదుగా కాకుండా, వేరే దారి ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. (ఇది చదవండి: పాక్‌కు భారీ నష్టం.. భారత్‌కు డబుల్‌ లాస్‌)

Poll
Loading...
మరిన్ని వార్తలు