ఒక్క నిమిషం కూడా ఆలస్యం కాలేదు!

11 Jun, 2016 20:14 IST|Sakshi
ఒక్క నిమిషం కూడా ఆలస్యం కాలేదు!

కొందరు పిల్లలు స్కూలుకు వెళ్లేందుకు మారాం చేస్తారు. మరికొందరు ఆటలు పోతాయన్న బాధతో, చదువంటే భయంతో  ఏడుస్తారు. కొందరు మాత్రం స్కూలంటే ఎంతో ఉత్సాహంగా ఉరకలేస్తారు. ఇప్పుడు దుబాయ్‌లోని ఢిల్లీ ప్రైవేట్ స్కూల్లో చదువుతూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న విద్యార్థి.. ఆ మూడో కోవకు చెందినవాడే. ఐదేళ్ళపాటు ఒక్కరోజు కూడా స్కూలుకు ఆలస్యంగా వెళ్లకపోగా.. ఏరోజూ స్కూలు మానకుండా నూరు శాతం హాజరుతో ఏకంగా ఐదు మెడల్స్ సంపాదించి అందర్నీ అబ్బురపరిచాడు.

చిన్నవయసు నుంచే పాఠశాలపై మక్కువ ఉండటంతో పాటు.. వందశాతం హాజరు ఉండాలన్న ఆశయంతో స్కూలుకు వెళ్లిన గల్ఫ్ విద్యార్థి... ఐదేళ్లకు గాను ఐదు మెడల్స్, ఐదు సర్టిఫికెట్లు సంపాదించి ఏ విద్యార్థికీ సాధ్యం కాని ప్రత్యేకతను సాధించాడు. ఇప్పుడు తనకు వచ్చిన సర్టిఫికెట్లు, మెడల్సే తన కచ్చితత్వానికి నిదర్శనమని, ఇది ఏ ఇతర విద్యార్థులనూ కించపరిచే విషయం కాదని అతడు ఆనందంగా చెప్తున్నాడు. ఒక విద్యార్థి ప్రతిరోజూ పది నిమిషాలు స్కూలుకు ఆలస్యమైతే ఏడాదిలో 30 గంటల పాఠాలను కోల్పోతాడన్న విషయాన్ని చిన్నతనంలో ఎక్కడో చదివానని, అప్పట్నుంచీ తాను చదువులో ముందున్నా లేకున్నా స్కూలుకు మాత్రం ఆలస్యంగా వెళ్ళకూడదని నిశ్చయించుకున్నానని చెప్తున్నాడు. అనుకున్నది సాధించాలంటే ఎంతో కష్టపడాల్సి వచ్చిందని, అయితేనేం మెడల్స్ సాధించగలగడం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందని చెప్తున్నాడు.  తన కష్టానికి ఈ మెడల్సే నిదర్శనమంటున్నాడు.

ఐదు అంకె తన లక్కీ నెంబర్ అని చెప్తున్న సదరు విద్యార్థి, ఐదో తరగతి నుంచి ప్రారంభించిన తన దీక్షను విజయవంతంగా కొనసాగించి ఐదు మెడల్స్ సాధించగలగడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందంటున్నాడు. తన కష్టాన్ని, కచ్చితత్వాన్ని ఢిల్లీ ప్రైవేట్ స్కూల్ గుర్తించిందని, అదే తన ఆనందానికి ప్రధాన కారణమైందని చెబుతున్నాడు.

మరిన్ని వార్తలు