టాలెంట్ ఉంటే చాలు.. ఇక వీసా ఈజీ

6 Feb, 2017 17:38 IST|Sakshi
టాలెంట్ ఉంటే చాలు.. ఇక వీసా ఈజీ

అబుదాబి:
అమెరికాలో హెచ్ 1 బి వీసాల విషయంలో అనేక గందరగోళ పరిస్థితులు తలెత్తిన నేపథ్యంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) మాత్రం టాలెంట్కు పెద్దపీట వేస్తూ కొత్త వీసా విధానం అమలు చేయాలని నిర్ణయించింది. ఆయా రంగాల్లో ప్రతిభను గుర్తించి అలాంటి వారిని ఎక్కువగా ఆకర్షించడానికి వీలుగా కొత్త వీసా విధానాన్ని రూపొందించనున్నట్టు ఆ దేశం ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల నుంచి వేలాదిగా ఇప్పటికే యూఏఈ లో పనిచేస్తున్న విషయం తెలిసిందే. విదేశీయులకు ప్రధానంగా నిర్మాణ రంగంలో ఎన్నో అవకాశాలున్నాయి.  ఇకనుంచి విద్య, వైద్యం, టూరిజం, సైన్స్, రీసర్చ్ వంటి రంగాలకు పెద్ద పీట వేయాలని నిర్ణయించింది.

ప్రపంచ వ్యాప్తంగా 150 కి పైగా దేశాలకు చెందిన వారు ఆయా రంగాల్లో అక్కడ పనిచేస్తున్నారు. తాజాగా కీలక రంగాల్లో "క్వాలిఫైడ్ ప్రొఫెషనల్స్" కు పెద్దపీట వేయాలని యూఏఈ నిర్ణయించింది. యూఏఈ ప్రధాని, దుబాయ్ రాజు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మఖ్తూమ్ అధ్యక్షతన జరిగిన కేబినేట్ సమావేశం ఈ మేరకు తీర్మానించింది. అత్యున్నత అర్హత కలిగిన ప్రొఫెషనల్స్ను ఆకర్షించాల్సిన అవసరం ఉందని కేబినేట్ అభిప్రాయపడింది. యూఏఈ అనేక రంగాల్లో అవకాశాలు కల్పిస్తూ 'ల్యాండ్ ఆఫ్ అపర్చునిటీస్' గా మంచి వాతావరణం కల్పించామని, ఈ నేపథ్యంలో యూఏఈ కి వచ్చే వారిలో టాలెంట్ను ఎక్కువగా ఆకర్షించడానికి కొత్త వీసా విధానం అమలు చేయబోతున్నట్టు వివరించారు.


ప్రధానంగా టూరిజం, హెల్త్, ఎడ్యుకేషన్ రంగాల్లో అధిక ప్రాధాన్యత కల్పించి ఆ రంగాల్లో నిపుణులకు అధికంగా వీసాలు మంజూరు చేయాలని నిర్ణయించారు. అలాగే మెడిసిన్, సైన్స్- రీసర్చ్ రంగాల్లో కూడా ఎక్కువ వీసాలు జారీ చేయనున్నారు. దీనికి సంబంధించి త్వరలోనే కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసే అవకాశాలున్నాయి. ఇకపోతే వివిధ దేశాలతో సంబంధాలను మరింతగా మెరుగుపరుచుకోవడానికి రాజధాని అబుదాబిలో అన్ని దేశాలు ఎంబసీలను ఏర్పాటు చేసుకోవడానికి కూడా వీలు కల్పించాలని నిర్ణయించారు.

మరిన్ని వార్తలు