ఊహించని ప్రమాదం​.. వీడియో విడుదల

22 Mar, 2018 13:57 IST|Sakshi

శాన్‌ ఫ్రాన్సిస్కో : ఉబెర్‌ సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కారు టెస్టింగ్‌ ఓ మహిళ ప్రాణాలను బలి తీసుకున్న ఘటన చర్చనీయాంశంగా మారింది. పూర్తిగా అభివృద్ధి చేయకుండా  ఈ తరహా వాహనాలను బిజీ రోడ్ల పైకి ఎలా అనుమతించారని పలువురు మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే ఘటనకు సంబంధించిన వీడియోను  టెంపె పోలీస్‌ శాఖ బుధవారం విడుదల చేసింది. 

ప్రమాద సమయంలో వోల్వో వాహనంలోని కెమెరాల ద్వారా లోపల, బయట జరిగిన పరిణామాలు రికార్డు అయ్యాయి. చీకట్లో ఎలైనే హెర్జ్‌బర్గ్‌(49) తన సైకిల్‌తో రోడ్డు దాటుతున్న క్రమంలో ఈ ప్రమాదం సంభవించింది. ఆ సమయంలో లోపల కూర్చున్న వాహనదారు కూడా ఊహించని ఆ పరిణామంతో షాక్‌ తినటం చివర్లో చూడొచ్చు.  

ఆదివారం రాత్రి అరిజోనా రాష్ట్రంలోని టెంపె ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. క్యాబ్‌ అగ్రిగేటర్‌​ ఉబెర్‌కు చెందిన  డ్రైవర్‌ లెస్‌​కారు ఢీ కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డ హెర్జ్‌బర్గ్‌ ఆస్పత్రిలో మృతి చెందింది. కారులోని వ్యవస్థ పాదాచారిని గుర్తించకపోవటంతోనే ప్రమాదం జరిగినట్లు నిపుణులు వెల్లడించారు. ఘటన నేపథ్యంలో ఈ తరహా వాహనాల పరీక్షను నిలిపివేస్తున్నట్టు  ఉబెర్‌  ప్రకటించింది. మరోవైపు వీటి పని తనంపై అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో వీటిని అందుబాటులోకి తేకపోవటమే ఉత్తమమన్న డిమాండ్‌నూ పలువురు తెరపైకి తెస్తున్నారు.

మరిన్ని వార్తలు