అమెరికా ఎన్నికలు : ప్రతినిధుల సభలో డెమొక్రాట్ల హవా

7 Nov, 2018 12:30 IST|Sakshi

న్యూయార్క్‌ : అమెరికాలో జరిగిన మధ్యంతర ఎన్నికల ఫలితాలు అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆధిపత్యానికి గండికొట్టేలా వెలువడుతున్నాయి. హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌‌లో డెమొక్రటీ పార్టీ అభ్యర్థులు మెజార్టీ దిశగా సాగుతుండగా, అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పార్టీకి చెందిన రిపబ్లికన్లు సెనేట్‌లో సత్తా చాటుతున్నారు. అమెరికా పార్లమెంటును కాంగ్రెస్ పేరుతో వ్యవహరిస్తారు.

కాగా, ప్రతినిధుల సభలో 435 స్థానాలకు, సెనేట్‌లోని మొత్తం 100 స్థానాల్లో 35 సీట్లకు ఎన్నిక జరిగింది. వీటితోపాటు 36 రాష్ట్రాల గవర్నర్లు సహా పలు  పదవులకు కూడా ఎన్నికలు జరిగాయి. ఇప్పటివరకూ వెలువడిన ఫలితాల ప్రకారం డెమోక్రాట్లు మరో 23 స్థానాల్లో విజయం సాధిస్తే ప్రతినిధుల సభలో వీరు పైచేయి సాధిస్తారు. వర్జీనియా, ఫ్లోరిడా, పెన్సీల్వేనియా, కొలొరాడో వంటి రాష్ట్రాల్లో రిపబ్లికన్లపై డెమోక్రాట్లు విజయం సాధించారు. మరోవైపు సెనేట్‌లో నార్త్‌ డకోటా, ఇండియానా స్థానాల్లో రిపబ్లికన్లు గెలుపొందారు. టెక్సాస్‌ స్థానంలో రిపబ్లికన్‌ అభ్యర్థి టెడ్‌ క్రుజ్‌ విజయం సాధించారు.


ట్రంప్‌ దూకుడుకు బ్రేక్‌..
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నికైన రెండేళ్ల తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికలను ఆయన పనితీరుకు రెఫరెండంగా పరిగణిస్తున్నారు. ఇక మధ్యంతర ఎన్నికల్లో అద్భుత విజయం సాధించామని డొనాల్డ్‌ ట్రంప్ ట్విట్ చేయడం గమనార్హం​. 2016 అధ్యక్ష ఎన్నికల్లో ఊహించని రీతిలో విజయం సాధించిన ట్రంప్, కాంగ్రెస్‌లో సంఖ్యాబలం అండతో ఏకపక్ష నిర్ణయాలతో చెలరేగారు. మధ్యంతర  ఎన్నికల్లో డెమొక్రాట్లు గణనీయంగా ఎన్నికవడంతో ట్రంప్‌ దూకుడుకు బ్రేక్‌ పడనుంది.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా