ట్రంప్‌ డ్రీమ్‌కు రెక్కలొచ్చాయి..

28 Jul, 2017 09:03 IST|Sakshi
ట్రంప్‌ డ్రీమ్‌ నెరవేరుతుందా..?

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ కల నెరవేరనున్నట్లు తెలుస్తోంది. మెక్సికోతో తమ దేశానికి ఉన్న సరిహద్దు గుండా నిర్మించాలనుకుంటున్న భారీ ప్రహరీ నిర్మాణం ప్రక్రియ మొదలుకానుంది. అందుకోసం కావాల్సిన డబ్బుకు సంబంధించిన బిల్లు అమెరికా ప్రతినిధుల సభలో ఆమోదం పొందింది. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ట్రంప్‌ ప్రాధాన్యత అంశాల్లో ఈ మెక్సికో గోడనే ముందు వరుసలో ఉన్న విషయం తెలిసిందే. అయితే, దీని నిర్మాణం కోసం మెక్సికో కూడా ఖర్చు భరించాల్సి ఉంటుందని అమెరికా చెప్పగా మెక్సికో నిరాకరించింది.

దీంతో తామే ఈ నిర్మాణం పూర్తి చేయాలని ట్రంప్‌ నిర్ణయించుకున్నారు. ఈ మేరకు దీనికి సంబంధించిన బిల్లు ఆమోదం పొందింది. మొత్తం 827 బిలియన్ల ప్యాకేజీకి సంబంధించిన బిల్లును గురువారం సభలో ప్రవేశపెట్టగా 235మంది ప్రతినిధులు ఉన్న హౌజ్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్‌లో 192మంది ఆమోదించారు. దీంతో ఇందులోని 1.6 బిలియన్‌ డాలర్లను ప్రత్యేకంగా గోడ నిర్మాణానికే ఖర్చు చేయనున్నారు. అక్రమ వలసలను, మాదక ద్రవ్యాలు అమెరికాలోకి రాకుండా అడ్డుకునేందుకు ఈ ప్రహరీ నిర్మాణం చేయనున్నారు. అయితే, ఈ బిల్లు సెనేట్‌లో కూడా ఆమోదం పొందాల్సి ఉంది. సెనేట్‌లో డెమొక్రాట్లు అధికంగా ఉన్నారు. ఇది చట్ట రూపం దాల్చేందుకు ముందు సెనేట్లు కూడా ఈ బిల్లును ఆమోదించనుంది.

మరిన్ని వార్తలు