‘హెచ్‌–1బీ ప్రీమియం’ పునఃప్రారంభం

5 Oct, 2017 03:06 IST|Sakshi

వాషింగ్టన్‌: అన్ని రంగాలకు సంబంధించిన హెచ్‌–1బీ వీసాల ప్రీమియం ప్రాసెసింగ్‌ (అధిక రుసుము తీసుకుని దరఖాస్తును వేగంగా పరిష్కరించడం)ను అమెరికా మంగళవారం పునఃప్రారంభించింది. ప్రీమియం ప్రాసెసింగ్‌కు దరఖాస్తులు ఎక్కువగా వస్తుండటంతో ఈ ఏడాది ఏప్రిల్‌లో అమెరికా ఈ విధానాన్ని తాత్కాలికంగా నిలిపివేయడం విదితమే. సెప్టెంబర్‌లో కొన్ని రంగాల్లోని వీసాలకు మాత్రమే ప్రీమియం ప్రాసెసింగ్‌ను అనుమతించిన అగ్రరాజ్యం తాజాగా అన్ని రకాల హెచ్‌–1బీ వీసాలకు ఈ విధానంలో దరఖాస్తు చేసుకునే వెసులుబాటును కల్పించింది. ఈ మేరకు అమెరికా పౌరసత్వం, వలస సేవల విభాగం ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రీమియం ప్రాసెసింగ్‌ కింద వచ్చిన హెచ్‌–1బీ దరఖాస్తులను అమెరికా 15 రోజుల్లో పరిష్కరిస్తుంది.

ఆలస్యమైతే దరఖాస్తుదారుడు సాధారణం కన్నా అధికంగా చెల్లించిన డబ్బును వెనక్కు ఇస్తుంది. కొన్ని ప్రత్యేక, సాంకేతిక నిపుణత అవసరమైన ఉద్యోగాల్లో విదేశీయులను నియమించుకునేందుకు అమెరికా కంపెనీలను అనుమతించేదే హెచ్‌–1బీ వీసా. భారత ఐటీ ఉద్యోగులు ఎక్కువగా ఈ వీసాపైనే అమెరికాలో ఉద్యోగాలు చేయడానికి వెళ్తుంటారు. ఏడాదికి 65 వేల హెచ్‌–1బీ వీసాలను విదేశీయులకు, మరో 20 వేల హెచ్‌–1బీ వీసాలను అమెరికాలో ఉన్నత విద్యనభ్యసిస్తున్న ఇతర దేశాల వారికి ఇవ్వాలనేది అమెరికా కాంగ్రెస్‌ నిబంధన. హెచ్‌–1బీ వీసాలను కంపెనీలు దుర్వినియోగం చేస్తూ అమెరికా ప్రజలకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని భావిస్తున్న అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్, ప్రస్తుతం ఈ విధానాన్ని సమీక్షిస్తున్నారు. 

మరిన్ని వార్తలు