ఇది తొలి అడుగే...

13 Jun, 2018 01:36 IST|Sakshi

భేటీపై నిపుణుల విశ్లేషణ

అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్‌ల మధ్య మంగళవారం సింగపూర్‌లో జరిగిన చారిత్రక భేటీపై నిపుణులు భిన్నాబిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. కొరియా ద్వీపకల్పంలో అణు నిరాయుధీకరణకు ఈ భేటీ తొలి అడుగని కొందరు ప్రశంసిస్తున్నారు. అణ్వాస్త్రాల నిరోధం విషయంలో కచ్చితమైన కార్యాచరణను చేపట్టడంపై ఈ భేటీలో స్పష్టత లేదని మరికొందరు పెదవి విరుస్తున్నారు. కొన్ని దశాబ్దాలుగా కొరకరాని కొయ్యగా ఉన్న ఉ. కొరియాకు అమెరికా దగ్గరయ్యే ప్రయత్నం బాగానే ఉన్నా, సుదీర్ఘకాలంగా మిత్రులుగా ఉన్న వారితో ట్రంప్‌ వైరం పెంచుకోవడాన్ని నిపుణులు ఎత్తిచూపుతున్నారు.

ఇటీవల కెనడాలో జీ–7 శిఖరాగ్ర సమావేశంలో కెనడా ప్రధాని ట్రూడోను ట్రంప్‌ విమర్శించారు. కిమ్‌తో భేటీని తన గొప్పతనంగా చెప్పుకుంటూ.. దీనిని అమెరికాలో నవంబర్‌లో జరగనున్న మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్లు పైచేయి సాధించేందుకు ట్రంప్‌ వాడుకోవచ్చంటున్నారు. అణ్వస్త్రాలు విడిచిపెట్టే విషయంపై పదేళ్ల క్రితం ఎక్కడైతే చర్చలు ఆగిపోయాయో అప్పటి ప్రకటననే తాజాగా సింగపూర్‌లో పునరుద్ఘాటిస్తున్నట్టుగా ఉందని వాషింగ్టన్‌కు చెందిన ఫౌండేషన్‌ ఫర్‌ డిఫెన్స్‌ ఆఫ్‌ డెమొక్రసీస్‌ అనే మేధో సంస్థకు చెందిన ఆంథోని రుగ్గిరో అన్నారు. కనీసం ప్రస్తుత భేటీకి కొనసాగింపుగా జరిగే సమావేశమైనా అణ్వాయుధాల నిరోధానికి చివరి మజిలీగా నిలుస్తుందా అన్న సందేహం వ్యక్తంచేశారు.

అణ్వాయుధాలను త్యజించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణకు ఆయా అంశాలతో కూడిన కాలపట్టికను ఈ శిఖరాగ్ర సమావేశంలో రూపొందించుకోకపోవడంతో ఇది ఏ మేరకు ఫలప్రదమైందనే విషయంలో ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.  సింగపూర్‌ సంయుక్త ప్రకటనలోనూ ముఖ్యమైన అంశాల ప్రస్తావన లేదనీ, లక్ష్యాలు కోరుకోవడం మాత్రమే ఉన్నందున ఇది ఉత్తరకొరియా విజయంగానే భావించాల్సి ఉంటుందని గతంలో ఆ దేశంతో చర్చల్లో పాల్గొన్న ఈవాన్స్‌ రెవరె అభిప్రాయపడ్డారు. ట్రంప్‌ కన్నా ముందు ముగ్గురు అమెరికా అధ్యక్షులు అణు నిరాయుధీకరణకు ఉత్తరకొరియాను ఒప్పించగలిగారు.

క్షిపణి ఇంజన్‌ తయారీ కేంద్రాన్ని మూసివేస్తామంటూ కిమ్‌ మాట మాత్రంగానే చెప్పారు. దక్షిణకొరియాతో అమెరికా సాగిస్తున్న సంయుక్త సైనిక విన్యాసాలను నిలిపేసేందుకు తాను సానుకూలమని ట్రంప్‌ చెప్పారు. ఇదే ఉత్తరకొరియా ప్రధాన డిమాండ్‌ కావడం గమనార్హం. ఇదంతా బాగానే కనిపిస్తోందని, వ్యవహార శైలీ, ధోరణులు, ప్రతీకవాదానికే(సింబాలిజం) ఈ భేటీ పెద్దపీట వేసినట్టుగా ఉందని అమెరికా దౌత్యశాఖ మాజీ అధికారి మింటరో అభిప్రాయపడ్డారు. 1972లో అప్పటి అధ్యక్షుడు నిక్సన్‌ కమ్యూనిస్టు చైనా సందర్శన ద్వారా రెండుదేశాల మధ్యనున్న శత్రుత్వాన్ని దూరం చేయగలిగారని నిపుణులు చెబుతున్నారు.

దానితో పోల్చితే సింగపూర్‌ సమావేశం సాధించిన ఘనతేమి లేదంటున్నారు. కిమ్‌ కచ్చితమైన చర్యలు తీసుకునే వరకు ఆంక్షలు కొనసాగుతాయంటూ ట్రంప్‌ ప్రకటించడంతో ఆ దేశం అణు నిరాయుధీకరణ దిశగా అడుగులేస్తుందని కొందరంటున్నారు. ఈ చారిత్రక భేటీ నిజంగా ఫలప్రదమవుతుందా? కొరియా ద్వీపకల్పాన్ని అణ్వాయుధ రహితంగా మార్చడంలో ట్రంప్‌ విజయం సాధిస్తారా? సమాధానాల కోసం మరికొన్నేళ్లు ఆగాల్సిందే.    –సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

మరిన్ని వార్తలు