నా సామిరంగా....మాకే ఆ విమానం దొరికుంటేనా!

18 Mar, 2014 17:14 IST|Sakshi
నా సామిరంగా....మాకే ఆ విమానం దొరికుంటేనా!

మలేషియా విమానం ఎక్కడకి పోయింది?
మా గగనతలం మీదుగా పోలేదు గాక పోలేదు అని భారత పాకిస్తాన్ లు ఢంకా బజాయించి చెబుతున్నాయి.
సముద్రంలో శకలాలేవీ కనిపించడం లేదని సాటిలైట్లు చెబుతున్నాయి. సమగ్ర పరమాణు పరీక్షా నిషేద ఒప్పంద సంస్థ (సీటీబీటీఓ) అధ్యయనాల్లో గత పది పన్నెండు రోజుల్లో రికార్డు అయేంత గగన విస్ఫోటనం జరగనేలేదని చెబుతోంది. దీన్ని యూఎన్ సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ ప్రతినిధఙ స్టిఫాన్ డుజారిక్ ధ్రువీకరిస్తున్నారు.
సీటీబీటీఓ తాలూకు అంతర్జాతీయ మానిటరింగ్ వ్యవస్థ ఎలాంటి భారీ పేలుడునూ రికార్డు చేయలేదు. కాబట్లి విమానం పేలిపోయి ఉండకపోవచ్చునని ఆయన అంటున్నారు.
మలేషియా సహా దాదాపు పన్నెండు దేశాల విమానాలు, యుద్ధ నౌకలు ఎడతెగకుండా గాలిస్తూనే ఉన్నాయి.  ఇప్పుడు అన్వేషణ అంతాకజాకిస్తాన్, కిర్గిజిస్తాన్ ల నుంచి ఇండోనీషియా దాకా జరుగుతోంది. విమానాన్ని అయిదు వేల అడుగుల కన్నా తక్కువ ఎత్తున తీసుకువెళ్తే తప్ప రాడార్లను తప్పించుకోవడం సాధ్యం కాదంటున్నారు ఏవియేషన్ రంగ నిపుణులు.

అనువైన చోటే ట్రాన్స్ పాండర్ స్విచాఫ్ చేశారా?
మలేషియన్ అదికారులు మాత్రం విమానం సిబ్బంది, ముఖ్యంగా కాప్టెన్ జహారీ అహ్మద్ షా, కో పైల్ ఫరీక్ అబ్దుల్ హమీద్ ల పైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వాళ్ల ఇళ్లలో సోదాలు జరిగాయి. ముఖ్యంగా మలేషియా, వియత్నాం దేశాల మధ్య ఉన్న బఫర్ ప్రాంతంలో ట్రాన్స్ పాండర్లను పైలట్లు స్విచాఫ్ చేయడం జరిగింది. దీంతో మలేషియా వియత్నాం విమానం కోసం వెతుకుతోందని, వియత్నాం మలేషియా వెతుకుతుందని భ్రమలో ఉన్నాయి. ఇరు దేశాలు మేల్కొనేసరికి ఆలస్యం అయిపోయింది.
పైలట్లు ఒక పక్కా ప్రణాళికతోనే ఇదంతా చేశారని అనుమానాలు వ్యక్తమైఔతున్నాయి. అందుకే ఆల్ రైట్ గుడ్ నైట్ అని చెప్పి ట్రాన్స్ పాండర్ ను స్విచాఫ్ చేసి ఉంటారని నిపుణులు చెబుతున్నారు.
విమానం కాప్టెన్, కో పైలట్ లు విమానం ఎక్కే ముందు బోర్డింగ్ పాస్ లు చెక్ చేస్తున్న క్లిప్పింగ్ లు కూడా యూట్యూబ్ లో దర్శనమిస్తున్నాయి.

మాకే ఆ విమానం దొరికుంటేనా... అంటున్న తాలిబాన్లు
మరో వైపు చాలా మంది ఈ విమానం తాలిబాన్ల ఇష్టారాజ్యమైన ఖైబర్ ఫక్తూన్ ఖ్వాకో లేక భారతీయ విమానాన్ని తీసుకెళ్లిన కాందహార్ కో తీసుకువెళ్లి ఉండవచ్చునని కూడా భావిస్తున్నారు. పాక్-అఫ్గన్ సరిహద్దుల్లో ఎక్కడో ఒకక్కడ విమానం ఉండొచ్చునని కూడా అంచనాలు వేస్తున్నారు.
అయితే 'అలాంటి విమానమేదీ మా ప్రభావ క్షేత్రంలో లేదు. ఈ విమానానికీ మాకూ ఎలాంటి సంబంధమూ లేదు'  అని పాక్ తాలిబాన్ కమాండర్ జబీహుల్లా ముజాహిద్ చెబుతున్నారు. 'మేమెలాంటి ఆపరేషన్ చేయలేదు' అని ఆయన తేల్చి చెప్పారు.
అక్కడితో ఆగకుండా ముజాహిద్ 'అసలు అలాంటి విమానమే కనుక మాకే కనుక దొరికి ఉంటే ....' అని కూడా అనేశారు. 'ఈ సంఘటన మా ఏరియాలో జరగలేదు. ఇది బయట జరిగింది. చాలా సాంకేతిక పరిజ్ఞానం ఉన్న దేశాలు గాలిస్తున్నాయి.' అన్నారు ముజాహిద్.
 

మరిన్ని వార్తలు