వైరల్‌: పగలబడి.. పెద్ద పెట్టున నవ్వడంతో..!

11 Sep, 2019 15:58 IST|Sakshi

నవ్వు నాలుగు విధాల చేటు అన్నది ఒకప్పటి నానుడి. ఇప్పుడు నవ్వు నలభై విధాల ఆరోగ్యానికి మేలు చేస్తుందని అంటున్నారు ఆధునిక శాస్త్రవేత్తలు. చక్కగా నవ్వుతూ ఉన్నవారి శరీరం, మనస్సు ఆరోగ్యకరంగా ఉంటాయని తేల్చారు. నవ్వు అనేక విధాలు. కొంతమంది ముసిముసి నవ్వులు నవ్వితే.. మరికొంతమంది పగలబడి నవ్వుతారు. కొంతమంది కనిపించి కనిపించకుండా లోలోపల నవ్వుకుంటే.. మరికొంతమంది చిన్నచిన్న ఆనందాలకే పట్టరాని సంతోషాన్ని వ్యక్తంచేస్తూ ఎదుటివారు జడుసుకునేలా అమాంతం నవ్వేస్తుంటారు. 

ఏవైనా సంభ్రమాశ్చర్యాలకు లోనుచేసే వింత సందర్భాలు ఎదురైతే.. పట్టరాని ఆనందంతో పగల్బడి నవ్వుతుండటం చూసి ఉంటాం. అలాంటి సందర్భాల్లో నవ్వును ఆపుకోవడం, కంట్రోల్‌ చేసుకోవడం కష్టమే. కానీ, అతిగా పగల్బడి నవ్వితే.. అది చిక్కులు తెచ్చే అవకాశముంది. అందుకు ఇప్పుడు ఈ చైనా మహిళే నిదర్శనం. ఇటీవల రైలులో వెళుతున్నప్పుడు ఓ చైనా మహిళా పట్టరాని ఆనందంతో నవ్వేసింది. ఎంత గట్టిగా నవ్విందంటే.. ఆమె తన నవ్వును కంట్రోల్‌ చేసుకోలేకపోయింది. అంతే ఆ నవ్వు దెబ్బకు ఆమె దవడ పక్కకు జరిగిపోయింది. మరి నవ్వేందుకు తెరిచిన నోరు మూయడానికి వీలుపడలేదు. పగలబడి పెద్ద పెట్టున నవ్వడంతో దవడ పక్కకు జరిగిపోయి.. కనీసం నోరు మామూలుగా మూసేందుకు, మాట్లాడేందుకు వీలుపడక ఆ మహిళ తీవ్ర అవస్థను ఎదుర్కొంది.

నొప్పితో అవస్థ పడుతూ కిందపడి దొర్లింది. దీంతో లౌ వెన్‌షెంగ్‌ అనే వైద్యుడిని అత్యవసరంగా పిలిపించారు. వైద్యుడు మొదట ఆ మహిళకు గుండెపోటు వచ్చిందేమో అనుకున్నాడు. కానీ, తీరా పరిస్థితి తెలిశాక.. తాను దవడ సరిచేసే.. నిపుణుడు కాకపోయినప్పటికీ.. ప్రయత్నించి చూస్తానని వైద్యుడు బాధిత మహిళకు తెలిపారు. ఆమె అంగీకరించడంతో ఆయన దవడను సరిచేసి ఉపశమనం కల్పించారు. గతంలో గర్భవతిగా ఉన్నప్పుడు తీవ్ర వాంతులు అవ్వడంతో ఆమెకు ఇదేవిధంగా దవడ పక్కకు జరిగింది. ఒక్కసారి ఈ విధంగా దవడ పక్కకు జరిగితే.. పెద్దపెట్టున నవ్వడం.. నోరు మొత్తం పెద్దగా తెరవడం వంటివి చేయరాదని లౌ వెన్‌షెంగ్‌ ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలిపారు. గ్వాంగ్‌ఝౌ దక్షిణ రైల్వే స్టేషన్‌కు వెళుతున్న హైస్పీడ్‌ రైలులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ సందర్భంగా నోరు మూయడానికి రాక అవస్థ పడుతున్న బాధిత మహిళ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా