ప్లాస్టిక్‌ సర్జరీతో 25కోట్లకు టోకరా..!

30 Jul, 2017 14:35 IST|Sakshi

వుహాన్‌: అప్పుల అప్పారావు సినిమా గుర్తుంది కదా. అందులో రాజేంద్ర ప్రసాద్‌ అప్పు ఇచ్చిన వారి నుంచి తప్పించుకు తిరగడానికి చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. అయితే మధ్య చైనాలో ఇలాంటి ఘటనే జరిగింది. కాకపోతే ఇక్కడ మహిళ. అప్పు ఇచ్చిన వారి నుంచి తప్పించు కోవడానికి ఓ మహిళ వింత ప్రయోగం చేసింది. బ్యాంకులకు సుమారు రూ.25 కోట్లు టోకరా వేసింది.

చైనాలోని ముఖ్య నగరమై వుహాన్‌కు చెందిన 59 ఏళ్ల మహిళ 25 మిలియన్ యువాన్‌లు (రూ.25కోట్లు) వ్యక్తిగత రుణం తీసుకుంది. తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించమని కోరితే అడ్రస్‌ లేకుండా పారిపోయింది. చైనాలోని అన్ని నగరాల్లో వెతికినా ఫలితం లేకుండా పోయింది. అయితే సదరు మహిళ మాత్రం ఎంచక్కా ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకుని అధికారుల ముందే దర్జాగా తిరిగింది. చివరకూ పోలీసులకు పట్టుపడిపోయింది. ఇలా లోన్‌ తీసుకుని చెల్లించని 186 మందిని పోలీసులు, బ్యాంకు అధికారులు అరెస్టు చేశారు.

మరిన్ని వార్తలు