హౌ డేర్‌ యూ... అని నిలదీసింది!

24 Sep, 2019 13:55 IST|Sakshi

హౌ డేర్‌ యూ... అని ప్రపంచ దేశాధినేతలను నిలదీసిందో 16 ఏళ్ల బాలిక. ఐక్యరాజ్యసమితి పర్యావరణ సదస్సు వేదికగా కడిగిపారేసింది. మా కలలను భగ్నం చేశారు. బాల్యాన్ని చిదిమేశారు. భవిష్యత్తును ప్రశ్నార్థకం చేశారు. పర్యావరణం నాశనమైపోతోంది. ప్రజలు చనిపోతున్నారు. కానీ మీకు ఇవేమీ పట్టవు. డబ్బు, వృద్ధి అంటూ కథలు చెప్తారు. మీకెంత ధైర్యం అని ఘాటుగా ప్రశ్నించింది స్వీడన్‌కు చెందిన గ్రెటా థంబర్గ్‌. మా తరాన్ని మీరు మోసం చేస్తున్నారు... మిమ్మల్ని ఎంతమాత్రం క్షమించబోమని హెచ్చరించింది. యువత మిమ్మల్ని గమనిస్తోంది.., ఇప్పుడు మీరు నవ్వుకున్నా... త్వరలోనే మా వేదన ఎంత తీవ్రమైనదో తెలుస్తుందంటూ ఆక్రోశంగా ప్రసంగించింది థంబర్గ్​.

‘మీ భూటకపు మాటలతో చిన్నప్పటి నుంచి నేను కన్న కలలను నాశనం చేశారు. భవిష్యత్తును ప్రశ్నార్థకం చేశారు. పర్యావరణ వ్యవస్థ అస్తవ్యస్తమైపోయింది. ప్రజలు చనిపోతున్నారు. ప్రస్తుతం పర్యావరణం అంతరించిపోయే మొదటి దశలో మనం ఉన్నాం. మీరు మాత్రం ఆర్థిక అభివృద్ధంటూ, డబ్బంటూ కట్టుకథలు అల్లుతున్నారు. మీకెంత ధైర్యం? గడిచిన 30 ఏళ్లలో ఈ సూచనలు​ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మా సమస్యలను వింటున్నామని మీరు చెబుతున్నారు. ఒకవేళ మీరు నిజంగా పరిస్థితిని అర్థం చేసుకొని ఉంటే సమస్యను పరిష్కరించడంలో విఫలమయ్యేవారు కాదు. అందుకే మిమ్మల్ని నేను నమ్మలేను. ప్రకృతికి హాని కలిగించే​ వాయువులను నివారించడంలో విఫలమై... నూతన తరానికి ఆరోగ్యకర వాతావరణాన్ని అందించకుండా ఉండేందుకు ఎంత ధైర్యం? యువత మిమ్మల్ని గమనిస్తోంది. ఇప్పుడు మీరు నవ్వుకున్నా... త్వరలోనే మా వేదన ఎంత తీవ్రమైనదో తెలుస్తుంది’ అని గ్రెటా థంబర్గ్‌ తన ఆవేదనను వ్యక్తం చేశారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా