‘రోడ్డు’పై సూచిక బోర్డులెక్కడ.? 

12 Feb, 2018 17:02 IST|Sakshi

రాష్ట్రీయ రహదారిలో కన్పించని హోర్డింగ్‌లు

తల్లాడలో వాహనదారులకు అసౌకర్యం  

తల్లాడ : నిత్యం రద్దీగా ఉండే రాష్ట్రీయ రహదారిలో సూచిక బోర్డుల ఏర్పాటులో ఆర్‌అండ్‌బీ అదికారులు తగిన శ్రద్ధ వహించడం లేదు. దీంతో నిత్యం వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రీయ రహదారిలో వివిధ పట్టణాలను, వాటి దూరాన్ని సూచించే బోర్డులు లేక వాహనదారులు తికమక పడుతున్నారు. కొన్ని చోట్ల ఏర్పాటు చేసిన బోర్డులు శిథిలావస్థకు చేరి పాడై పోయాయి. గతంలో కిలోమీటరుకు కోటి రూపాయల చొప్పున వరగంల్‌ నుంచి దేవరపల్లి వరకు రాష్ట్రీయ రహదారిని అభివృద్ధి చేశారు. రోడ్డును అభివృద్ది చేసిన తర్వాత ఆర్‌అండ్‌బీ అధికారులు బోర్డులను ఏర్పాటు చేశారు. అప్పట్లో ఇవి వాహనదారులకు ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయి. అయితే ఏళ్లు గడవటంతో అవి గాలి, వాన, ఎండలకు దెబ్బతిన్నాయి. వాటి ఫోల్స్‌ కొన్నింటిని దొంగలు ఎత్తుకెళ్లారు. తల్లాడ నుంచి భద్రాచలం, కొత్తగూడెం, సత్తుపల్లి, రాజమండ్రి, విజయవాడ, ఖమ్మం, సూర్యాపేట, హైదరాబాద్‌ వంటి ప్రాంతాలకు వాహనాలు వెళ్తుంటాయి.

భద్రాచలం, కొత్తగూడెం ప్రాంతాల నుంచి హైరరాబాద్‌ వైపు వెళ్లాలంటే పక్కనే సత్తుపల్లి రోడ్డు ఉంటుంది. ఇక్కడ వాహనాదారులు తికమక పడి ఒక్కోసారి సత్తుపల్లి రోడ్డులో కొద్దిదూరం వెళ్లిన తర్వాత వాహనం ఆపుకొని స్థానికులను అడిగి తెలుసుకొని మళ్లీ వారు వెళ్లాల్సిన రూటుకు పయనిస్తున్నారు. దీంతో సమయం, ఆయిల్‌ వృథా అవుతోంది. అలాగే ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి  ఖమ్మం వైపు నుంచి భద్రాచలం వెళ్లాలంటే సత్తుపల్లి, భద్రాచలం రోడ్ల వద్ద ఎటు వెళ్లాలో తెలియక అయోమయానికి గురౌతున్నారు. సత్తుపల్లి వైపు నుంచి వచ్చే ఇతర జిల్లాలు, రాష్ట్రాల వాహనదారులు కూడా తల్లాడ రింగ్‌ రోడ్‌ సెంటర వద్ద ఆలోచించాల్సి వస్తోంది. రాష్ట్రీయ రహదారిలో నాగాపూర్, విశాఖపట్టణం, చత్తీస్‌ఘడ్, గుంటూరు, రాజమండ్రి, విజయవాడ, వంటి సుదూర ప్రాంతాల నుంచి లారీలు సరుకులతో రాత్రివేళ వెళ్తుంటాయి. సూచించే బోర్డులు సరిగా లేకపోవటంతో అసౌకర్యం కలుగుతోంది.   

మరిన్ని వార్తలు