అంతా తూచ్‌!

6 Jan, 2018 08:00 IST|Sakshi

డిసెంబర్‌ 26న ఎలాంటి తాంత్రిక పూజలు జరగలేదు

ప్రధాన అర్చకుడు బదిరీనాథ్‌బాబు అలాంటి వారు కాదు

దేవాలయ ప్రతిష్ట దెబ్బతింటోంది

నిజనిర్ధారణ కమిటీకి లేఖ ఇచ్చిన దుర్గగుడి ఉద్యోగులు

‘డిసెంబర్‌ 26వ తేదీ దుర్గగుడిలో ఎలాంటి తాంత్రిక పూజలు జరగలేదు. ఆలయ ప్రధాన అర్చకుడు బదిరీనాథ్‌బాబు అలాంటి వారు కాదు. ఇతర అర్చకుల సహాయం తీసుకున్నారు. అంతే..’ అంటూ దుర్గగుడి ఉద్యోగుల సంఘం నిజనిర్ధారణ కమిటీ ముందు వాపోయింది. శుక్రవారం ఉదయం నుంచి 11 గంటల పాటు సాగిన విచారణలో దేవాలయ ప్రతిష్ట దెబ్బతింటోందని వారంతా ఆవేదన చెందారు. అనంతరం ఉద్యోగులంతా కనీసం మీడియాతో కూడా మాట్లాడకుండా గప్‌చుప్‌గా వెళ్లిపోయారు.

సాక్షి,విజయవాడ: దుర్గగుడిలో డిసెంబర్‌ 26వ తేదీ రాత్రి ఎలాంటి తాంత్రిక పూజలు జరగలేదంటూ శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ఉద్యోగులు, అర్చకుల సంఘం నిర్ధారించింది. శుక్రవారం ఇంద్రకీలాద్రి గెస్ట్‌హౌస్‌లో ఉన్న నిజనిర్ధారణ కమిటీ సభ్యులు రఘునా«థ్, చిర్రావూరి శ్రీరామశర్మను వారు కలిసి మాట్లాడి ఒక విజ్ఞాపన పత్రం అందజేశారు. ఆరోజు తాంత్రిక పూజలు జరిగే అవకాశమే లేదని, దేవాలయం ప్రతిష్ట దెబ్బతినడం తమకు ఎంతో బాధ కలిగిస్తోందంటూ ఆ పత్రంలో వివరించారు.

ఏ తప్పు జరగలేదు : ఆలయ సిబ్బంది
వేద పండితుడు గురునాథ ఘనాపాటి మాట్లాడుతూ ప్రధాన అర్చకుడు బదిరీనాథ్‌బాబు తాంత్రిక పూజలు ఎప్పుడు చేసే అవకాశం లేదన్నారు. ఆయన పూర్వీకులు ఐదు తరాలుగా అమ్మవారి సేవలోనే ఉన్నారని, ఇప్పటికీ ఏ దేవాలయంలోనైనా స్వామివార్లకు, అమ్మవార్లకు అలంకారం చేయాలంటే ఆయనే వెళ్తారని చెప్పారు. అలాంటి వ్యక్తి తాంత్రిక పూజలు చేసేందుకు సహకరించే అవకాశమే లేదని అభిప్రాయపడ్డారు. బదిరీనాథ్‌బాబు ఒక్కరే పూజా కార్యక్రమాలు నిర్వహించలేరని, ఇతర అర్చకుల సహాయం తీసుకుంటారని చెప్పారు. మహిషాసురమర్దనీదేవి అలంకారం చేయాలంటే సామగ్రి కావాలని, అవేమి అక్కడ లేవని గుర్తుచేశారు. ఈ ఘటనలో దేవస్థానం సూపరింటెండెంట్, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్, ఎస్‌పీఎఫ్‌ సిబ్బంది ఏ తప్పు చేయలేదని ఆలయ సిబ్బంది, ప్రతినిధులు తెలిపారు. దేవస్థానంలో సిబ్బంది, అర్చకుల్లో గ్రూపులు ఉన్నాయని, వాటివల్లే ఏదో జరిగిందనే ప్రచారం జరుగుతోందనే విమర్శలు ఉన్నాయని, అయితే తామంతా ఒకటేనని నిజనిర్ధారణ కమిటీకి వివరించారు. యూనియన్‌ నాయకుడు రాజు, వైదిక కమిటీ సభ్యులు ఎం.షణ్ముఖేశ్వరశాస్త్రి, కోటా ప్రసాద్, రంగాబత్తుల శ్రీనివాసరావు పాల్గొన్నారు.

గతంలో ఈ సఖ్యత ఏమైంది?
నిజ నిర్ధారణ కమిటీ సభ్యుల్ని కలిసి బయటకు వచ్చిన అనంతరం అర్చకుల్లో విభేదాలు వచ్చాయి. గతంలో ఐదుగురు అర్చకులను దేవస్థానం నుంచి బలవంతంగా బయటకు పంపినప్పుడు ఈ సఖ్యత ఏమైందంటూ రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనాడు లేని ఐక్యత ఇప్పుడు ఎందకంటూ ప్రశ్నించారు. అన్ని విషయాల్లోనూ దేవస్థానం సిబ్బంది ఏకతాటిపై ఉండాలనేదే తన ఆవేదనంటూ గట్టిగా చెప్పారు.

11 గంటల పాటు విచారణ
ఉదయం 9 నుంచి రాత్రి 8 గంటల వరకు నిజనిర్ధారణ కమిటీ సభ్యులు విచారణ చేశారు. ఆరోజు వ్యవహారంలో బాధ్యులైన పార్థసారథితో పాటు అర్చకులు, దేవస్థానం ఇద్దరు ప్రధాన అర్చకులు, స్థానాచార్య, ఇతర అర్చకులను పిలిచి విచారణ చేశారు.

గప్‌చుప్‌గా..
విచారణ ఎదుర్కొని వచ్చిన వారంతా మౌనంగా వెళ్లిపోయారే తప్ప లోపల ఏమీ జరిగిందో మీడియాకు చెప్పేందుకు నిరాకరించారు. దేవస్థానంలోని విషయాలు బయటకు పొక్కడం వల్ల ఎవరూ నోరు ఎత్తవద్దంటూ ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది. దీంతో అందరూ మౌనంగానే వెళ్లిపోయారు. పాలకమండలి సభ్యులు కూడా అక్కడ కనిపించలేదు. చైర్మన్‌ యలమంచిలి గౌరంగబాబును ఆయన చాంబర్‌లో రఘునాథ్, శ్రీరామ్‌శర్మ కలిశారు. ఆరోజు జరిగిన దానిపై ఆయన అభిప్రాయం కోరగా, పోలీసు నివేదిక వచ్చాక చెబుతానని అన్నట్లు తెలిసింది.

మరిన్ని వార్తలు