టీ20 లీగ్‌ విజేత భద్రాద్రి జట్టు | Sakshi
Sakshi News home page

టీ20 లీగ్‌ విజేత భద్రాద్రి జట్టు

Published Sat, Jan 6 2018 8:12 AM

telangana t20 league won the bhadradri district - Sakshi

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): తెలంగాణ టీ20 లీగ్‌ మ్యాచ్‌లలో భాగంగా  మూడు రోజులుగా స్థానిక ప్రకాశం స్టేడియంలో జరిగిన నాలుగు జిల్లాల క్రికెట్‌ లీగ్‌ మ్యాచ్‌లు శుక్రవారం ముగిశాయి. ఒక్కొక్క జట్టుకు మిగిలిన మూడు జట్లతో జరిగిన మ్యాచ్‌లలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జట్టు జైత్రయాత్రను కొనసాగించింది. 

భద్రాద్రి కొత్తగూడెం జట్టు ఘనవిజయం 
శుక్రవారం మధ్యాహ్నం ఖమ్మం జిల్లా జట్టు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జట్టు మధ్య జరిగిన చివరి లీగ్‌మ్యాచ్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జట్టు ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జట్టు ప్రారంభం నుంచే ధాటిగా ఆడి 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 209 భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి జట్టు ముందు ఉంచింది.  

చెలరేగిన సాయికుమార్‌.. 
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జట్టు వైస్‌ కెప్టెన్‌ సాయికుమార్‌ మరోసారి చెలరేగి 53 బంతుల్లో 11 సిక్స్‌లు, 10 ఫోర్లతో 124 పరుగులు చేశాడు. మిగిలిన క్రీడాకారుల్లో రాజ్‌ కుమార్‌ 20 పరుగులు చేయగా, నందురెడ్డి 21 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఖమ్మం జిల్లా జట్టు బౌలర్లలో హరీష్‌ 52/2, అభిలాష్‌ 35/2 వికెట్లు తీశారు.  అనంతరం 210 భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఖమ్మం జట్టు ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 120 పరుగులు మాత్రమే చేసింది. 

జరిగిన నాలుగు మ్యాచ్‌లలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జట్టు విజయాలు నమోదు చేసుకోవడంతోపాటు ఆ జట్టుకు వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించిన సాయికుమార్‌ అన్ని మ్యాచ్‌లలో ప్రతిభ చూపి  ఆఖరు లీగ్‌ మ్యాచ్‌లో 53 బంతుల్లో 124 పరుగులు సాధించడంతో మ్యాన్‌ ఆ«ఫ్‌ది సిరీస్‌ అవార్డును దక్కించుకున్నాడు. ఉమ్మడి జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ తరపున మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డుతోపాటు రూ.20 వేల నగదు బహుమతిని కొత్తగూడెం డీఎస్పీ ఎస్‌.ఎం.అలీ, ఒలంపిక్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు జీవీకే మనోహార్,  ఉమ్మడి జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ గౌరవ కార్యదర్శి చేకూరి వెంకట్‌ ముగింపు సభలో సాయికుమార్‌కు అందజేశారు.  

సూర్యాపేట జట్టుపై మహబూబాబాద్‌ జట్టు విజయం 
చివరిరోజైన శుక్రవారం ప్రకాశం స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్‌లో మహమూబాబాద్‌ – సూర్యాపేట జట్లు తలపడగా, మహబూబాబాద్‌ జట్టు విజయం సాధించింది. మొదట టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న సూర్యాపేట 20 ఓవర్లలో 113 పరుగులు చేసి ఆలౌటయింది.  జట్టులోని బి.అనిల్‌ 37, ఎస్‌.కె.ఫజల్‌ 21 రన్లు చేశారు. మహబూబాబాద్‌ జిల్లా జట్టు బౌలర్లలో ఎ.గణేష్‌ 11 పరుగులిచ్చి 3 వికెట్లు, బి.కుమార్‌ 19 పరుగులిచ్చి 2 వికెట్లు, జి.సత్య 22 పరుగులిచ్చి 2 వికెట్లు సాధించారు. 114 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన మహబూబాబాద్‌ జిల్లా జట్టు వికెట్‌ నష్టపోకుండా 13 ఓవర్లలో 114 పరుగులు చేసి ఘనవిజయం సాధించింది. జట్టులోని బి.కుమార్‌ 67, ఎ.గణేష్‌ 37 పరుగులు చేశారు.  
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement