చుక్క చుక్కకూ లెక్కకట్టాల్సిందే..!

7 Feb, 2018 10:09 IST|Sakshi

నగరంలో వాటర్‌ మీటర్లు అమర్చేందుకు రంగం సిద్ధం

1.11 లక్షల కుటుంబాలపై అదనపు భారం

కార్పొరేషన్‌ బడ్జెట్‌లో తమ అంతరంగాన్ని వెలిబుచ్చిన మేయర్‌

విపక్షాల ఆందోళలను పట్టించుకోని పాలకవర్గం

సాక్షి,అమరావతిబ్యూరో: విజయవాడ నగరంలో ఇక ప్రతి నీటి బొట్టుకు లెక్క కట్టాల్సి వస్తోంది. ప్రతి కుళాయికి మీటర్లు బిగించి తద్వారా నీటి వినియోగం బట్టి భారం వేసేందుకు పాలక వర్గం రంగం సిద్ధం చేస్తుంది. త్వరలోనే ఈ విధానం అమలు చేసేందుకు తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇటీవల జరిగిన నగరపాలకసంస్థ బడ్జెట్‌ సమావేశంలో నగర ప్రథమపౌరుడు తన మనసులో మాటను చెప్పేశారు. ప్రభుత్వం తమ పై ఒత్తిడి తెస్తుందని త్వరలోనే మీటర్ల బిగింపుపై చర్చించుకుని అమలు చేద్దామని తెగేసి చెప్పారు. దీంతో త్వరలోనే ఈ విధానం అమలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. నీటి కొలతల వల్ల పేదలపై భారం పడే అవకాశం ఉందని విపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా వారు పట్టించుకోనే  పరిస్థితి లేదు.

నీటి సరఫరా ఇలా..
నగరంలో దాదాపు 15.50 లక్షల మంది జనాభా ఉన్నారు. పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా నీటి సరఫరా అందడం లేదు. జనాభా అవసరాలకుగాను రోజుకు 49 ఎంజీడీల మంచినీటిని నగర పాలక సంస్థ సరఫరాచేయాల్సి ఉంది. కానీ కేవలం 36 ఎంజీడీల వరకు అందిస్తోంది. నగర పాలక సంస్థలో ఇప్పటికి తాగునీటికి సరైన ప్రణాళిక లేకపోవడంతో నగరంలో నీటి కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. భవానీపురంలో హెడ్‌ వాటర్‌ వర్క్స్‌ వద్ద 5, 8, 16,11  ఎంజీడీల చొప్పున ట్యాంకులు నిర్మించి సరఫరా చేస్తున్నారు.  బ్యారేజ్‌ దిగువున 4 ఎంజీడీలు, రామలింగేశ్వర్‌నగర్‌లో 10 ఎంజీడీల , గంగిరెద్దుల దిబ్బ సమీపంలో 10 ఎంజీడీల సామర్థ్యం ఉన్న ట్యాంకులు ఉన్నాయి. కానీ పూర్తిస్థాయిలో  ఇవ్వడం లేదు.

1.13 లక్షల కుళాయిలకు మీటర్లు
విజయవాడ నగర పాలక సంస్థలో 1.89 లక్షల గృహాలు ఉన్నాయి.ఇక కుళాయిల వివరాలను పరిశీలిస్తే సర్కిల్‌ –1 లో 31,847, సర్కిల్‌–2 లో 47,687, సర్కిల్‌ –3 లో 31,820 కుళాయి కనెక్షన్స్‌లున్నాయి.. మొత్తం మీద నగరంలో  1.11,354 లక్షల కుళాయిలు ఉన్నాయి. ఇంకా 78 వేల నివాసాలకు కుళాయిలు లేవు. ప్రతి కుళాయికి మీటరు బిగించి నీటి వినియోగం లెక్క గట్టే అవకాశం ఉంది.  ప్రస్తుతం నీటికుళాయి పొందాలంటే  శ్లాబుల వారీగా నగదు చెల్లించాలి. ఇంటి పన్నుబట్టి  శ్లాబు విధానం రూ.5525. రూ.6500, రూ.7500 ,రూ.8500 వంతున కుళాయి కనెక్షన్‌కు చెల్లించాలి.  ఆపార్టెమెంట్స్‌లో పది ప్లాట్లు కు రూ.1.5 లక్షలు, పదిహేను ప్లాట్లకు రూ.1.55 లక్షలు వసూళ్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఇంటి పన్నును  బట్టి నీటి పన్ను వసూళ్లు చేస్తున్నారు. ఆ పన్నులకు గాను . గత ఏడాది బడ్జెట్‌లో రూ.4.71 కోట్లు  ఆదాయం చూపించారు. నూతన బడ్జెట్‌లో  మాత్రం రూ.5.2 కోట్లు నీటి పన్ను  ఆదాయం వస్తుందని అంచనా వేశారు. గతేడాదికంటే నీటి పన్ను రూ.31 లక్షల అదనపు ఆదాయం వసూళ్లు చేస్తున్నట్లు బడ్జెట్‌లో పెరుగుదల చూపారు.

విపక్షాల అభ్యంతరాలను..
నీటికి మీటర్లు విధానం వద్దని నగర పాలకసంస్థ విపక్ష సభ్యులు అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు. నగరంలోనే కృష్ణానదీ వెళ్తుంది. ఈ నేపధ్యంలో నీటి బొట్టును లెక్కించడం తప్పు పడుతుంది. నదీ ప్రవాహం పక్కన ఉండే నగరంలోకూడా నీటి కొలతలతో ప్రజలపై భారం వేయడం సబబు కాదని వారిస్తున్నా వారి మాటలను పరిగణలోకి తీసుకునే అవకాశం లేనట్లు కనిపిస్తోంది.

నీటి బొట్టు కొలతే..
నగరంలో ప్రతి నీటì బొట్టు కొలత వేసేలా మీటర్లు అమర్చనున్నారు. ప్రస్తుతం ఒకొక్కరికి రోజుకు 130 లీటర్లు వరకు వినియోగం జరుగుతుదని అంచనాతో నీటి సరఫరా చేస్తున్నారు. అయితే 150 లీటర్లు పైగా వినియోగం జరుగుతుంది. దీంతో నీటి సరఫరా ప్రణాళిక సక్రమంగా లేకపోవడంతో పలు ప్రాంతాల్లో నీటి సమస్య అధికంగా ఉంది. ప్రస్తుతం నగరంలో 8095 నీటి మీటర్లు ఉన్నాయి. ఆయా మీటర్లు పరిధిలో నీటి వినియోగం బట్టి పన్నులు వసూళ్లు చేస్తున్నారు. ఇకపై అన్ని చోట్ల కుళాయిలకు మీటర్లు బిగిస్తే రోజువారీగా వినియోగించే నీటి పన్నుతో పాటు  అదనంగా వినియోగిస్తే వాటికి అదనపు చెల్లింపులు వేస్తారు. ప్రతి లీటర్‌ నీటికి పన్ను విధించే అవకాశం ఉంది. నీటికి మీటర్లు విధానం సిమ్లాలో అమలవుతుంది. గతంలో పాలక వర్గం సిమ్లా వెళ్లి ఆ విధానం బాగుందని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో ప్రభుత్వం అదేవిధంగా అమలు చేయాలని పాలక వర్గంపై ఒత్తిడి పెంచింది.

మరిన్ని వార్తలు