రేషన్‌బియ్యం పట్టివేత

18 Jan, 2018 08:50 IST|Sakshi

బియ్యం తరలిస్తున్న వారిపై దాడి చేసిన గుర్తుతెలియని వ్యక్తులు

పోలీసుల రంగప్రవేశంతో తప్పించుకున్న కేటుగాళ్లు

రేషన్‌ బియ్యం తరలింపులో నయా దందా

గద్వాల పట్టణ పోలీసుస్టేషన్‌ కేసు నమోదు

గద్వాల క్రైం: ఇది నా ఇలాఖా.. ఇక్కడి ప్రాంతాల్లో పేదల రేషన్‌ బియ్యానికి నేనే పెద్ద డేగను..! నా కళ్లు గప్పి నా ప్రాంతంలోని రేషన్‌ బియ్యం విక్రయాలు చేసి తీసుకువెళ్తావా.. అంటూ గద్వాలకు చెందిన ఓ ముఠా సభ్యులు ఆక్రోశం..? ఎక్కడైతే ఏంటి.. కారుచౌకగా బియ్యం దొరుకుతాయంటే ఎవరి ప్రాంతంలోనైనా గుట్టుగా కొని సొమ్ము చేసుకుంటాం అంటూ.. కేటీదొడ్డి మండలానికి చెందిన మరో ముఠా సభ్యుల ఎదురుదాడి..!? ఇలా రెండు ముఠా సభ్యులు గద్వాల ప్రాంతంలో రేషన్‌ బియ్యం కొనేందుకు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కేటీదొడ్డికి చెందిన ముఠా సభ్యులు గద్వాల నుంచి రేషన్‌ బియ్యం తరలిస్తున్నారనే సమాచారం తెలుసుకుని.. గద్వాలకు చెందిన ముఠా సభ్యులు వారిపై దాడి చేసి బియ్యం తరలిస్తున్న ఆటోను ధ్వంసం చేశారు. ప్రాణభయంతో కేకలు వేయగా గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పట్టణ పోలీసులు అక్కడికి చేరుకోగా.. దాడి చేసిన ముఠా సభ్యులు పారిపోయారు. బియ్యం తరలిస్తున్న గూడ్స్‌ ఆటో, ఇద్దరు వ్యక్తులను పట్టణ పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఈ సంఘటన బుధువారం తెల్లవారుజామున మండలంలోని చేనుగోనిపల్లి గ్రామ శివారులో చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం..

దారి కాచి దాడి..
కాలూరుతిమ్మన్‌దొడ్డి మండల కేంద్రానికి చెందిన రాము, నరేష్‌లు గూడ్స్‌ ఆటోలో సుమారు 40 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని చెనుగోనిపల్లి గ్రామం నుంచి బుధవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో గుట్టుగా తరలిస్తున్నారు. అయితే విషయం తెలుసుకున్న మరో ముఠా సభ్యులు దారి కాచి ఆటోను పట్టుకున్నారు. ఆటోలోని బియ్యం ఎక్కడికి తరలిస్తున్నారు..? ఎవరు పంపిచారంటూ ఆటోపై దాడి చేశారు. అంతటితో ఆగక ఇద్దరిపై దాడి చేశారు. దెబ్బలకు తాళలేక వారు కేకలు వేయగా గమనించిన స్థానికులు పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకోవడంతో ముఠా సభ్యులు అక్కడి నుంచి  తప్పించుకున్నారు. దీంతో ఆటోను, ఇద్దరు వ్యక్తులను పట్టణ పోలీసుస్టేషన్‌కు  తరలించారు.

కొనుగోళ్లపై పోటాపోటీ..
గద్వాలలో రేషన్‌ బియ్యం కొనుగోళ్లు చేసేందుకు అక్రమార్కుల మధ్య పోటీ నువ్వా.. నేనా అన్నట్లుగా సాగుతుంది. ప్రభుత్వం సబ్సిడీ రూపంలో నిరుపేదలకు చౌకధర దుకాణాల ద్వారా కిలో రూపాయికి అందజేస్తుంది. అయితే బయటి మార్కెట్‌లో సుమారు రూ.20 ధర పలుకుతుంది. అయితే రేషన్‌ బియ్యం లబ్ధిదారుల నుంచి రూ.10–15 వెచ్చించి వివిధ వ్యక్తులు కొనుగోలు చేస్తున్నారు. అయితే రేషన్‌ బియ్యం అక్రమంగా కర్ణాటకకు తరలించి అక్కడి ప్రైవేట్‌ మిల్లుల్లో రీసైక్లింగ్‌ చేసి సన్నబియ్యంగా మారుస్తారు. ఇలా చేసిన బియ్యాన్ని వ్యాపారులతో కుమ్మక్కై బయటి మార్కెట్‌లో కిలో రూ.30–35లకు అమాయక ప్రజలకు విక్రయిస్తారు. లాభసాటి వ్యాపారం కావడంతో జిల్లాకేంద్రంలో రేషన్‌ బియ్యం కొనుగోలు చేసేందుకు పలు ముఠా సభ్యులు పోటీ పడుతున్నారు. వనపర్తి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్‌ జిల్లాల నుంచే కాక ఇతర జిల్లాల నుంచి గద్వాల, డ్యాం, ఆత్మకూర్‌ మీదుగా కర్ణాటకలోని రాయిచూర్‌కు నిత్యం రేషన్‌ బియ్యం తరలిస్తున్నారు.

కేసు నమోదు..
ఈ విషయమై గద్వాల పట్టణ  పోలీస్‌స్టేషన్‌ ఎస్‌ఐ శ్రీనివాస్‌ స్పందిస్తూ అక్రమంగా రేషన్‌ బియ్యం తరలిస్తున్నట్లు సిబ్బందికి సమాచారం రావడంతో దాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నామన్నారు. అయితే బియ్యం తరలిస్తున్న వారిపై దాడి చేసిన విషయమై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వివరించారు.

రెండు క్వింటాళ్ల నల్లబెల్లం..
మన్ననూర్‌ (అచ్చంపేట): అమ్రాబాద్‌ మండలం దోమలపెంట గ్రామ అటవీశాఖ చెక్‌పోస్టు వద్ద రెండు క్వింటాళ్ల నల్లబెల్లం, 40 కిలోల పటికి పోలీసులు పట్టుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని దోర్నాల నుంచి ఇండిగో కారులో నల్లబెల్లం అక్రమంగా తరలిస్తున్నారని దోమలపెంట పోలీసులకు సమాచారం అందడంతో నిఘా ఉంచారు. ఈ క్రమంలో అచ్చంపేట పట్టణ సమీప గ్రామాలకు చెందిన రమేష్, భరత్‌లు బెల్లంతో అక్కడికి వచ్చారు. కారుతోపాటు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు సిద్ధిఖ్, ప్రేమ్‌కుమార్, ఉపసర్పంచ్‌ ప్రసాద్‌ సంబంధిత అచ్చంపేట ఎక్సైజ్‌ అధికారులు శంకరయ్య, రమేష్, ఆంజనేయులుకు సమాచారం అందించి నిందితుల నుంచి అక్రమ బెల్లంను వారికి అప్పగించారు. బెల్లం ఎక్కడి నుంచి సరఫరా అవుతున్న విషయాలను దర్యాప్తు చేసి కేసు నమోదు చేస్తామన్నారు.

మరిన్ని వార్తలు