అక్కినేని అభినయ కిరీటంలో నవరత్నాలు

20 Sep, 2013 00:46 IST|Sakshi
అక్కినేని అభినయ కిరీటంలో నవరత్నాలు
అక్కినేని పుట్టింది భారతీయ సినిమా పుట్టిన పదేళ్లకు. ఆయన సినీ నటునిగా పుట్టింది తెలుగు సినిమా పుట్టిన పదేళ్లకు. ఈ తీరుని బట్టి చూస్తే.. సినిమా కోసమే ఈయన్ని దేవుడు పుట్టించాడా? అనిపిస్తుంది. కుటీర పరిశ్రమగా మొదలైన ‘సినిమా’ మహా పరిశ్రమగా ఎదగడానికి కారకులైన మహానుభావులు ఎందరో. వారిలో అక్కినేని తప్పకుండా ముందు వరుసలో ఉంటారు.
 
సినిమాను తెలుగు ప్రేక్షకులు అమితంగా ఇష్టపడుతున్నారంటే, తెలుగు సినిమా ఈ రోజు దక్షిణాదిలోనే అత్యధిక చిత్రాలు నిర్మించే స్థాయికి ఎదిగిందంటే అందులో అక్కినేని పాత్ర ఎంతో ఉంది. అందుకే ఆయన్ను తెలుగు సినిమా తల్లి రెండు కళ్లలో ఓ కన్నుగా అభివర్ణిస్తుంటారు సినీ పండితులు. నేడు ఆ మహానటుడు 90వ పడిలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా నటసమ్రాట్ అభినయ కిరీటంలోని నవ రత్నాలను ఒకసారి స్మరించుకుందాం. 
 
 లైలామజ్ను (1949)
 ఈ సినిమా వచ్చే నాటికి అక్కినేని సినీ నటనానుభవం ఎనిమిదేళ్లు. కానీ వంద సినిమాల నటుడికి కూడా సాధ్యపడనంత అమోఘమైన నటన కనబరిచారు. ‘ప్రేమికుడి పాత్రను ఇంత అద్భుతంగా చేయొచ్చా?’ అని సాటి నటులు సైతం విస్తుపోయేలా నటించారు అక్కినేని. లైలాతో పెళ్లి.. నిశ్చితార్థం దాకా వచ్చి ఆగిపోయిన సన్నివేశంలో లోకులందరూ ‘మజ్ను... మజ్ను’ అంటూ రాళ్లతో కొడుతుంటే... దెబ్బలను కూడా ఖాతరు చేయకుండా ఖైస్(అక్కినేని) నవ్విన నవ్వు చరిత్రలో నిలిపోయింది. ఒక్క నవ్వుతో జనహృదయాలపై గాఢమైన ముద్రను వేశారు అక్కినేని. 
 
 దేవదాసు (1953)
 ధనమదానికి, పెద్దరికానికీ తన ప్రేమనే బలిపెట్టిన పిరికివాడు దేవదాసు. అందుకే తనపై తనకు అసహ్యం. కావాలనే తన శరీరాన్ని హింసించుకున్నాడు. చేవ లేక, చేసేది లేక చావుకు దగ్గరయ్యాడు. ఈ పాత్రలో అక్కినేని నటన నభూతో నభవిష్యత్. మరొకరు టచ్ చేయడానికి కూడా ధైర్యం చేయని పాత్ర ఇది. దేవదాసుగా అక్కినేని నటనకు దిలీప్‌కుమార్ సైతం జోహార్లు అర్పించారు. ‘‘దేవదాసు’ అంటే అక్కినేని మాత్రమే’ అని పత్రికాముఖంగా అంగీకరించారు. ఆ పాత్ర జనాలను ఏ స్థాయిలో ప్రభావితం చేసిందంటే.. అప్పట్లో ప్రతి మద్యం దుకాణంపై అక్కినేనే కనిపించేవారట. 
 
 విప్రనారాయణ (1954)
 ఈ సినిమాను అక్కినేని ఒప్పుకున్నప్పుడు.. ‘దేవదాసు పాత్ర చేసిన నీకు ఈ హరిదాసు పాత్ర ఎందుకయ్యా. నీవు నాస్తికుడవు. భక్తిని ఎలా పలికిస్తావ్?’ అన్నారట చక్రపాణి. ‘తాగుబోతు పాత్ర పోషించేవాడు తాగుబోతే కానవసరం లేదు. భక్తుడి పాత్ర పోషించేవాడు భక్తుడే కానవసరం లేదు. నేను పాత్ర చేసి చూపిస్తాను’ అని చక్రపాణిగారితో ఛాలెంజ్ చేసి మరీ అక్కినేని ఈ పాత్ర చేశారు. విమర్శకులను సైతం విస్తుపోయేలా చేశారు. అటు భక్తునిగా, ఇటు స్త్రీ మోహంలో చిక్కుకున్న మానసిక బలహీనుడిగా అక్కినేని నటన అదరహో. 
 
 అనార్కలి (1955)
 ఈ కథతో బాలీవుడ్‌లో అప్పటికే సినిమా వచ్చింది. సలీంగా ప్రదీప్‌కుమార్  నటించారు. కానీ ఆ సలీం వేరే, ఈ సలీం వేరే. ఈ సలీంలో అమరప్రేమికుడు కనిపిస్తాడు. ప్రేమకోసం తండ్రి అక్బర్ బాదుషాని సైతం ఎదిరించే సన్నివేశంలో అయితే... వీరాధి వీరుడు అగుపిస్తాడు. అనార్కలిని జీవ సమాధి చేసే పతాక సన్నివేశంలో ‘అనార్.. అనార్..’ అంటూ అక్కినేని భావోద్వేగపూరితమైన నటన పతాకస్థాయిలో ఉంటుంది. ఇదీ మరొకరు టచ్ చేయలేని పాత్రే. 
 
 తెనాలి రామకృష్ణ (1956)
 రామకృష్ణ కవి అలాగే బిహేవ్ చేసేవారేమో! తన పాండిత్యంతో అందరినీ అలాగే నవ్వించేవారేమో! కోపం వస్తే పండితులను సైతం అలాగే తిట్టేవారేమో! ‘తెనాలి రామకృష్ణ’లో అక్కినేనిని చూస్తే ఇలాంటి భావాలే కలుగుతాయి. కళ్లను పెద్దవిగా చేసి విచిత్రంగా వాటిని కదిలిస్తూ, ఒక రకమైన డైలాగ్ డిక్షన్‌తో, వైవిధ్యభరితమైన శారీరక భాషతో ఆ పాత్రకు ప్రాణ ప్రతిష్ట చేశారు. ‘తెనాలి రామకృష్ణ ఎలా ఉంటారు?’ అని కళ్లు మూసుకుంటే తెలుగువాళ్లకు కనిపించే రూపం అక్కినేని. 
 
 మహాకవి కాళిదాసు (1960)
 నటునిగా అక్కినేనిని ఆకాశమంత ఎత్తులో నిలబెట్టిన సినిమా ఇది. ఇందులో ప్రథమార్ధం వెర్రిబాగులోడు. ద్వితీయార్థం మహాకవి. ఉత్తర దక్షిణ ధృవాల్లాంటి పాత్రలు. అక్కినేని లాంటి మహానటులు మాత్రమే అలాంటి పాత్రను పోషించగలరు. అమాయకుడు, అమేయ జ్ఞాన సంపన్నుడిగా మారే పరిణామ క్రమంలో అక్కినేని అభినయం అనితర సాథ్యం. 
 
 బాటసారి (1961)
 మానసిక రుగ్మత కలిగిన మేధావి కథ ఇది. అభిప్రాయాలు, అభిమతాలు, ఇష్టాఇష్టాలు.. ఇలా ఏ భావాన్నీ ఆ పాత్ర వ్యక్తం చేయలేదు. ఈ పాత్ర పోషణ నిజంగా కత్తిమీద సామే. సినిమా మొత్తం మీద అక్కినేని డైలాగులు రెండు పేజీలకు మించవు. ఇందులో అక్కినేని ఆహార్యం భిన్నంగా ఉంటుంది. కళ్లద్దాలు, పంచ, ధోవతితో అడపాదడపా కళ్లు ఆర్పుతూ భిన్నంగా కనిపిస్తారాయన. అప్పటికే అక్కినేని సూపర్‌స్టార్‌డమ్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. అలాంటి టైమ్‌లో ఈ పాత్ర చేయడానికి ఒప్పుకోవడం ఆయన తెగువకు దర్పణం. 
 
 శ్రీకృష్ణార్జున యుద్ధం (1963)
 ఇందులోని అర్జున పాత్రను అక్కినేని చేశారు కాబట్టే ఆ సినిమాకు ఓ విలువ ఏర్పడింది. వేరే ఎవరు పోషించినా... ఎన్టీఆర్ స్టార్ స్టేటస్ ముందు తేలిపోయేవారు. ఆయన్ను తట్టుకొని ఢీ కొట్టేంత స్థాయి ఉన్న నటుడు ఒక్క ఏఎన్నార్ మాత్రమే. కాబట్టే... కేవీరెడ్డి ఆయన్ను అర్జునుడిగా ఎంచుకున్నారు. అనుకున్నట్టే ఎన్టీఆర్‌తో నువ్వా-నేనా అనే స్థాయిలో నటించారు అక్కినేని. అర్జునుడి పాత్రకు ఓ నిండుదనం తెచ్చారు. 
 
 ప్రేమాభిషేకం (1981)
 దేవదాసు పాత్రకు పూర్తి విరుద్ధమైన పాత్ర రాజేష్ పాత్ర. దేవదాసు పిరికివాడు. రాజేష్ ధైర్యానికి మరో రూపం. దేవదాసుది త్యాగం కాదు. చేతకాని తనం. రాజేష్‌ది నిజమైన త్యాగం. ప్రియురాలి శ్రేయస్సు కోసం తనకు తాను చెడ్డవాడిగా చిత్రీకరించుకున్న త్యాగమూర్తి రాజేష్. ఆ తేడాను ఇందులో అక్కినేని అద్భుతంగా పలికించారు. దేవదాసు ధైర్యవంతుడైతే ఎలా ఉంటుందో ‘ప్రేమాభిషేకం’లోని రాజేష్ పాత్రలో చూపించారు అక్కినేని. పైగా ఈ సినిమా టైమ్‌లో అక్కినేని వయసు 58. కానీ టీనేజర్లు సైతం విస్తుపోయేంత చలాకీగా కనిపిస్తారాయన.
 
 ఈ తొమ్మిది సినిమాలు మచ్చుకు మాత్రమే. ఈ మహానటుడు నటించిన సినిమాల గురించి మాట్లాడాలంటే... ఒక గ్రంథమే అవుతుంది. అర్థాంగి, పునర్జన్మ, మూగమనసులు, మనసేమందిరం, ప్రేమనగర్, ధర్మదాత, సుడిగుండాలు, అనుబంధం, సీతారామయ్యగారి మనవరాలు... ఇలా చెప్పుకుంటే ఎన్నో ఎన్నెన్నో.. అయితే నేడు ఆయన పుట్టిన రోజు కాబట్టి చంద్రునికి ఓ నూలుపోగులా ఈ వ్యాసం.
 
 - బుర్రా నరసింహ