మానసిక వేదనతో బాధపడుతున్నా

16 Jun, 2020 06:14 IST|Sakshi

‘‘ప్రయాణం’, ‘ఊసరవెల్లి’, ‘మిస్టర్‌ రాస్కెల్‌’ చిత్రాలతో తెలుగు చిత్ర పరిశ్రమలోనూ గుర్తింపు తెచ్చుకున్నారు హీరోయిన్‌ పాయల్‌ ఘోష్‌. తమిళ్, కన్నడ, హిందీ, ఇంగ్లిష్‌ చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ ‘నేను ఐదేళ్లుగా మానసిక వేదనతో బాధపడుతున్నా’ అంటూ సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్ట్‌ వైరల్‌గా మారింది. ‘‘నేను ఐదేళ్లుగా డిప్రెషన్‌తో బాధపడుతూ మందులు తీసుకుంటున్నా. ఎక్కువ మానసిక వేదనకు గురైనప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనిపించేది. అయితే నేను డిప్రెషన్‌కి గురైనప్పుడల్లా నా కుటుంబ సభ్యులు, స్నేహితులు అండగా నిలబడుతున్నారు.

ఎంతో భవిష్యత్‌ ఉన్న సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధగా ఉంది. తన మరణం నన్ను ఎంతో కలచివేసింది.  సమస్యలన్నింటికీ ఆత్మహత్య ఒక్కటే పరిష్కారం కాదు. మానసిక ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలని నా ఫాలోయర్స్‌ని కోరుతున్నాను. మానసిక వేదనలో ఉన్నప్పుడు కుటుంబ సభ్యులతో, స్నేహితులతో మాట్లాడితే మంచిది. డాక్టర్‌ సహాయం తీసుకోవాలి. డిప్రెషన్‌లోంచి బయటకు రావడానికి ప్రయత్నించాలి. అంతేకానీ ఆత్మహత్యే సమస్యకు పరిష్కారం అనుకోకూడదు’’ అన్నారు.

మరిన్ని వార్తలు