వ్యక్తిగత పరిశుభ్రతతోనే వైరస్‌కు చెక్‌

17 Mar, 2020 08:23 IST|Sakshi

ట్విట్టర్‌ వేదికగా యాంకర్‌ సుమ సందేశం

బంజారాహిల్స్‌: ప్రతి ఒక్కరు 20 నుంచి 30 సెకన్ల పాటు చేతులు శుభ్రంగా కడుక్కోవడం తప్పనిసరని, ఎంత శుభ్రంగా ఉంటే కరోనాను అంత ధీటుగా ఎదుర్కోవచ్చునని ప్రముఖ యాంకర్‌ సుమ స్పష్టం చేశారు. ట్విట్టర్‌ వేదికగా ఆమె కరోనా వైరస్‌ ముందు జాగ్రత్త చర్యలపై తన వంతు బాధ్యతగా ఓ సందేశాన్ని పంపించారు. కరోనా వైరస్‌ గురించి ఎక్కువగా భయపడాల్సిన పని లేదని, మనం చేయాల్సిందల్లా బాధ్యతాయుతంగా ప్రవర్తించడమేనన్నారు. వీలైనంత వరకు మాస్క్‌లు ధరించాలని, వేళ్లను ఎక్కువగా ముఖం మీద టచ్‌ చేయకుండా చూసుకోవాలన్నారు.

ఒకవేళ దగ్గు, జలుబు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు. మన చుట్టు పక్కల వారు ఎవరైనా ఉంటే కూడా వారికి కూడా సలహా ఇవ్వాలన్నారు. ఎవరైనా కలిసినప్పుడు రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టాలన్నారు. ఆలింగనాలు, షేక్‌  హ్యాండ్‌లకు దూరంగా ఉండాలన్నారు. ఏదైనా వైరస్‌ వ్యాప్తి చెందాలంటే మన చేతుల నుంచి మాత్రమే పాకుతుందని సాధ్యమైనంత వరకు చేతులను ముఖంమీద పెట్టకుండా జాగ్రత్త తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉంటే కరోనా వైరస్‌ తరిమికొట్టవచ్చన్నారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, తాను కూడా తీసుకుంటున్నట్లు శానిటైజర్లను చేతులకు రాసుకుంటున్న దృశ్యాలను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. 
 

మరిన్ని వార్తలు