ఆ రోజు నుంచి ‘బిగ్‌బాస్‌’ కనిపించదు..

30 Oct, 2019 15:10 IST|Sakshi

‘బిగ్‌ బ్రదర్‌’.. విదేశాల్లో మంచి క్రేజ్‌ను సొంతం చేసుకున్న రియాలిటీ షో. ఎంపికచేసిన కొంతమంది సెలబ్రిటీలను 100 రోజులపాటు ఒక ఇంట్లోకి పంపించి, వారి మధ్య పోటీలు పెడుతూ, ఎవరేంటో చూపించడమే బిగ్‌ బ్రదర్‌ థీమ్‌. ఇక ఈ రియాలిటీ షోను మనదేశంలోకి బిగ్‌బాస్‌ పేరుతో దిగుమతి చేసుకున్నారు. అయితేనేం.. ఎక్కడా పరాయివాళ్లది అన్న భావన కలగకుండా.. మన నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసి ఇక్కడ ప్రయోగించారు. తొలుత హిందీలో బిగ్‌బాస్‌ రియాలిటీ షో మొదలుపెట్టగా అది మంచి హిట్టయ్యింది. దీంతో అక్కడ వెంటవెంటనే ఈ షోను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ పదమూడో సీజన్‌ నడుస్తోంది.

హిందీలో మాత్రమే కాకుండా పలు ప్రాంతీయ భాషల్లో కూడా బిగ్‌బాస్‌ షో విజయవంతంగా కొనసాగుతోంది. ఆయా రాష్ట్రాల్లో ఉన్న పాపులారిటీని బట్టి విజేతలకు అందించే ప్రైజ్‌మనీ కూడా మారుతూ వస్తోంది. తెలుగులో మాత్రం బిగ్‌బాస్‌ టైటిల్‌ గెలిచినవారికి రూ.50 లక్షల ప్రైజ్‌మనీ ఇస్తున్నారు. తెలుగు ప్రేక్షకులను గత 15 వారాలుగా అలరిస్తున్న బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌-3 వచ్చే నెల (నవంబర్‌) 3న ముగియనున్నట్లు షో నిర్వాహకులు ప్రకటించారు.

కాగా కింగ్‌ నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌- 3  జూలై 21న అట్టహాసంగా ప్రారంభమైంది. గత సీజన్ల టీఆర్పీ రేటింగ్‌లను కొల్లగొడుతూ 17.9 టీఆర్పీతో సంచలనం నమోదు చేసింది. అయితే దీన్ని చివరి వరకూ కొనసాగించడంలో బిగ్‌బాస్‌ టీం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. యావత్తు తెలుగు ప్రేక్షకులను తనవైపు తిప్పుకున్న ఈ రియాలిటీ షోను గ్రాండ్‌గా ముగించడానికి బిగ్‌బాస్‌ యాజమాన్యం వ్యూహరచన చేస్తోంది.  ఇందుకోసం హేమాహేమీలను రంగంలోకి దించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది.

ఇప్పటికే మెగాస్టార్‌ చిరంజీవిని గ్రాండ్‌ ఫినాలేకు రావాల్సిందిగా ఆహ్వానం పంపింది. దీనికి ఆయన ఓకే చెప్పినట్టు సమాచారం. టాప్‌ హీరోలతోపాటు హీరోయిన్లను కూడా రంగంలోకి దించనున్నారు. ఇప్పుడిప్పుడే క్రేజ్‌ సంపాదించుకుంటూ టాలీవుడ్‌లో మెరిసిపోతున్న హీరోయిన్లను బిగ్‌బాస్‌ షోకు రప్పించేందుకు కసరత్తులు మొదలుపెట్టారు. బిగ్‌బాస్‌ 3ని ఎంత గ్రాండ్‌గా మొదలుపెట్టామో అంతే గ్రాండ్‌గా ముగించాలన్నది నిర్వాహకుల ఆలోచన. బిగ్‌బాస్‌లో లిఖించుకున్న రేటింగ్‌ రికార్డులను గ్రాండ్‌ ఫినాలేతో తిరగరాయాలని ప్రణాళికలు వేస్తున్నారు. (చదవండి: గ్రాండ్‌ ఫినాలేకు బిగ్‌బాస్‌ ముస్తాబు..)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు