అటెండెన్స్‌ వేయించే బాధ్యత నాది– ‘అల్లరి’ నరేశ్‌

12 Mar, 2018 05:06 IST|Sakshi
సంయుక్తా హెగ్డే, అనిల్‌ సుంకర, నరేశ్, నిఖిల్, సిమ్రాన్‌

‘‘స్టూడెంట్స్‌ ఎవ్వరూ ఈనెల 16న అటెండెన్స్‌ గురించి పట్టించుకోకండి. ఆరోజు అటెండెన్స్‌ వేయించే బాధ్యత నాది’’ అన్నారు ‘అల్లరి’ నరేశ్‌. నిఖిల్, సిమ్రాన్‌ పరింజా, సంయుక్తా హెగ్డే ముఖ్య తారలుగా నటించిన చిత్రం ‘కిరాక్‌ పార్టీ’. కన్నడ ‘కిరిక్‌ పార్టీ’ కి రీమేక్‌. శరణ్‌ కొప్పిశెట్టిని దర్శకుడిగా పరిచయం చేస్తూ రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమా ఈ నెల 16న విడుదలవుతోంది. అజనీష్‌ లోక్నాద్‌ స్వరపరచిన ఈ చిత్రం పాటలను విజయవాడలో రిలీజ్‌ చేశారు. ముఖ్య అతిథి ‘అల్లరి’ నరేశ్‌ మాట్లాడుతూ– ‘‘నిఖిల్‌ను చూస్తే నాకు డ్యూరోసెల్‌ బ్యాటరీ గుర్తొస్తుంటుంది. అంత ఎనర్జిటిక్‌గా ఉంటాడు. కన్నడలో ఎంత పెద్ద హిట్‌ అయిందో తెలుగులోనూ అంతే హిట్‌ అవుతుందని ఆశిస్తున్నా’’ అన్నారు.

‘‘ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు మెసేజ్‌ ఉన్న సినిమా ఇది. ఈ చిత్రంలో నటించే అవకాశాన్నిచ్చిన అనిల్‌ సుంకరగారికి థ్యాంక్స్‌. చందు మొండేటికి ‘కార్తికేయ’, సుధీర్‌ వర్మకు ‘స్వామి రారా’ ఎంత పేరు తెచ్చాయో, ‘కిరాక్‌ పార్టీ’ శరణ్‌కి అంతే పేరు తీసుకొస్తుంది’’ అన్నారు నిఖిల్‌. ‘‘టీమ్‌ అంతా ఎంతో కష్టపడి పని చేశాం. సినిమా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు నిర్మాత అనిల్‌ సుంకర. ‘‘ప్రతి స్టూడెంట్‌ ఎంజాయ్‌ చేసేలా ఈ సినిమా ఉంటుంది. 16న బంక్‌ కొట్టి మరీ ఈ సినిమా చూస్తారని కోరుకుంటున్నా’’ అన్నారు దర్శకుడు శరణ్‌. దర్శకుడు సుధీర్‌ వర్మ, సిమ్రాన్‌ పరింజా, సంయుక్తా హెగ్డే తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు