భార్యకు ఇంట్లోనే ప్రసవం చేయించిన సినీ కళాకారుడు

2 Nov, 2018 11:42 IST|Sakshi

చెన్నై, తిరువొత్తియూరు: చెన్నై సినీ కళాకారుడు తన భార్యకు సుఖ ప్రసవం కోసం ప్రయత్నించి గర్భిణి అయినప్పటి నుంచి ఆస్పత్రికి వెళ్లకనే ఇంట్లోనే ప్రసవం చేయించిన సంఘటన తెన్‌కాశి సమీపంలో సంచలనం కలిగించింది. ఇటీవలి కాలంలో యూట్యూబ్‌ చూసి ఇంట్లో ప్రసవం చేసిన యువతి, చెన్నై సమీపంలో నర్సుకు ఇంట్లో ప్రసవం చేసిన సంఘటనలు జరిగాయి. కానీ అవి వికటించి ఇంట్లో ప్రసవం చేసిన బాలింతలు మృతిచెందారు. ఈ క్రమంలో ఇంట్లో గర్భిణులకు ప్రసవం చూసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ తెన్‌కాశిలో ఓ సంఘటన వెలుగులోకి వచ్చింది. తెన్‌కాశి సమీపం ఇడైకాల్‌ ప్రాంతానికి చెందిన రమేష్‌ (31) అతనికి జయలక్ష్మి (22) అనే యువతితో వివాహమైంది.

రమేష్‌ చెన్నైలో సినీ పరిశ్రమలో కళాకారుడుగా ఉన్నారు. ఈ క్రమంలో అతను జయలక్ష్మి గర్భిణి అయినప్పటి నుంచి ఆసుపత్రికి తీసుకెళ్లక నాటు మందులు, యోగా శిక్షణను ఇచ్చినట్టు తెలిసింది. నిండుగర్భిణి అయిన జయలక్ష్మిని ప్రసవం కోసం రమేష్‌ 10 రోజుల ముందు చెన్నై నుంచి తెన్‌కాశి సమీపం ఇడైకాల్‌లో ఉన్న తన ఇంటికి తీసుకొచ్చాడు. బుధవారం ఉదయం 8.30 గంటలకు జయలక్ష్మి సుఖ ప్రసవంతో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దీని గురించి సమాచారం తెలుసుకున్న ఇడైకాల్‌ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం ఆసుపత్రి నర్సులు రమేష్‌తో శిశువు బొడ్డు పేగు కత్తిరించాలని కోరారు. దీనికి రమేష్‌ తిరస్కరించాడు. దీంతో శంకరన్‌ కోవిల్‌ జిల్లా మెటర్నిటీ ఆసుపత్రి ప్రధాన వైద్య అధికారి గోమతి, ఇడైకాల్‌ పోలీసులు అక్కడికి చేరుకుని రమేష్‌తో మాట్లాడారు. దీంతో ఆసుపత్రి చికిత్సకు రమేష్‌ సమ్మతించడంతో జయలక్ష్మిని శిశువును ప్రైవేటు అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. దీని తరువాత తల్లి నుంచి శిశువుకు బొడ్డు తీగ కోసి చికిత్స అందిస్తున్నారు.

మరిన్ని వార్తలు