రాజకీయాల్లో గౌరవం ఏమీ మిగల్లేదు: రవీనా టాండన్

13 May, 2016 16:46 IST|Sakshi
రాజకీయాల్లో గౌరవం ఏమీ మిగల్లేదు: రవీనా టాండన్

తన సినిమా కెరీర్ మొత్తంలో వివిధ సామాజిక సమస్యలపై గళమెత్తిన హీరోయిన్ రవీనా టాండన్ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా దూసుకెళ్తోంది. కానీ, ఆమెతో పాటు నటించిన గోవిందా, శత్రుఘ్న సిన్హా లాంటివాళ్లంతా రాజకీయాల్లోకి వచ్చినా.. తనకు మాత్రం ఆ రంగంలోకి వెళ్లే ఆలోచన లేదని స్పష్టం చేసింది. దానికి కారణం ఏమిటంటే. రాజకీయాల్లో ఇక గౌరవం ఏమీ మిగల్లేదట. తాజాగా 'మాత్ర్ - ద మదర్' అనే సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న రవీనా.. తనకు రాజకీయాలు ఏమాత్రం సరిపోవని అంటోంది. రాజకీయాల్లో చేరి ఈ ప్రపంచానికి ఏమైనా చేద్దామనుకున్నా కూడా.. మంచివాళ్లకు అన్నీ అడ్డంకులే ఎదురవుతాయని చెప్పింది. పదేళ్ల క్రితం ఉన్నతాధికారులు, నాయకులకు కాస్త గౌరవం ఉండేదని, కానీ ఇప్పుడు చూస్తే సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారని, అసలు గౌరవం అన్నది ఎక్కడా మిగల్లేదని తెలిపింది.

'మాత్ర్- ద మదర్' సినిమాలో ఇంతకుముందు స్లమ్‌డాగ్ మిలియనీర్‌లో నటించిన మధుర్ మిట్టల్ కూడా ఉన్నాడు. హింస, అత్యాచారాల బాధితులైన మహిళలకు న్యాయం చేయడానికి జరిగే పోరాటమే ఈ సినిమా ఇతివృత్తం. బాల నేరస్తుల వయసును చాలా దేశాలు 14-16 ఏళ్లకు తగ్గించాయని, మనం మాత్రం దాన్ని 18 ఏళ్లుగానే నిర్ధారిస్తున్నామని రవీనా ఆవేదన వ్యక్తం చేసింది. మహిళలపై జరిగే నేరాలకు ఉరిశిక్ష వేయాలని తాను అడగబోనని, తనకు రక్తదాహం లేదని కానీ.. నేర తీవ్రత ఎంత అనే విషయాన్ని మాత్రం గుర్తించాలని చెప్పింది.

>