నటనకు అనుమతించారు కానీ..!

30 Jun, 2017 02:14 IST|Sakshi
నటనకు అనుమతించారు కానీ..!

తమిళసినిమా: తాను హీరోయిన్‌ అవుతానని అన్నప్పుడు కుటుంబసభ్యులు సమ్మతించడంతో పాటు, మద్దతుగా నిలిచారని, అయితే చిత్రాన్ని నిర్మిస్తానన్నప్పుడు మాత్రం తన కుటుంబసభ్యులతో పాటు చాలా మంది వద్దని నిరుత్సాహపరిచారని నటి విజయలక్ష్మీ పేర్కొన్నారు. చెన్నై–28 చిత్రం ద్వారా నటిగా రంగప్రవేశం చేసిన ఈమె తాజాగా నిర్మాత అవతారమెత్తి తన భర్త ఫెరోజ్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ పండగై అనే చిత్రం  నిర్మిస్తున్నారు.

కృష్ణ, ఆనంది హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో సరవణన్‌ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. చిత్ర నిర్మాణం దాదాపు పూర్తయిన క్రమంలో పండిగై చిత్రం జూలై 7న విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం చెన్నైలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిత్ర నిర్మాత నటి విజయలక్ష్మీ మాట్లాడుతూ ఈ చిత్ర కథానాయకుడు కృష్ణ తనకు మంచి మిత్రుడని తెలిపారు. చిత్రం కోసం ఎంతగానో శ్రమించారని, కేరవన్‌కు కూడా వెళ్లకుండా చాలా కష్టపడి నటించారని పేర్కొన్నారు.

అదే విధంగా చిత్ర సాంకేతిక వర్గం పోటీ పడి మరీ చిత్రం బాగా రావాలని అహర్నిశలు పని చేశారని చెప్పారు.  ఇప్పుడు ఈ చిత్ర విడుదల హక్కులను కొనుగోలు చేసిన ఆరా సినిమా అధినేత మహేశ్‌ ఇప్పుడు తమకంటే ఎక్కువగా శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. ఈ చిత్ర విడుదల తరువాత మరో నాలుగు చిత్రాలను నిర్మించాలన్న కోరిక కలుగుతోందని విజయలక్ష్మీ తెలిపారు.
ఎవరూ ముందుకు రాలేదు
ఈ చిత్ర కథను చాలా మందికి చెప్పానని, అందరూ బాగుందని అన్నా నిర్మించడానికి ముందుకు రాకపోవడంతో తామే నిర్మించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు చిత్ర దర్శకుడు ఫెరోజ్‌ తెలిపారు. ఇందులో కృష్ణ, ఆనంది, సవరణన్‌లను నటింపజేయాలనుకున్నామని, అది సాధ్యం అయ్యినందుకు సంతోషం కలిగిందన్నారు. ఇది వీధి పోరాట ఇతివృత్తంతో కూడిన చిత్రం కావడంతో ఫైట్స్‌కు ప్రాముఖ్యత ఉంటుందని, స్టంట్‌మాస్టర్‌ అన్భరివు అద్భుతంగా ఫైట్స్‌ కంపోజ్‌ చేశారని తెలిపారు. చిత్రం చూడకుండానే నమ్మకంతో చాలా పెద్ద మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టిన ఆరా సినిమాస్‌ అధినేత మహేశ్‌కు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానన్నారు.