వారిద్దరిని మిస్సవుతున్నాం: అమెరికా దౌత్యవేత్త

1 May, 2020 10:40 IST|Sakshi

రిషి కపూర్‌, ఇర్ఫాన్ ఖాన్‌‌లకు అమెరికా దౌత్యవేత్త నివాళులు

వాషింగ్టన్‌: బాలీవుడ్‌ దిగ్గజ నటులు రిషి కపూర్‌, ఇర్ఫాన్‌ ఖాన్‌ మరణం పట్ల  అమెరికా దక్షిణ-మధ్య ఆసియా వ్యవహారాల తాత్కాలిక సహాయక కార్యదర్శి అలైస్‌ వెల్స్ సంతాపం ప్రకటించారు. వీరిద్దరు భారతీయులతో పాటు ప్రపంచ సినీ ప్రేమికులను తమ నటనతో కట్టపడేశారని.. వారిని మిస్సవుతున్నామని విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు... ‘‘ఈ వారంలో ఇద్దరు బాలీవుడ్‌ లెజెండ్స్‌ ఇర్ఫాన్‌ ఖాన్‌, రిషి కపూర్‌ ఈ లోకాన్ని విడిచి వెళ్లారనే వార్త నన్ను బాధకు గురిచేసింది. తన నటనా కౌశల్యంతో అమెరికా, ఇండియాతో పాటు ప్రపంచంలోని ప్రేక్షకుల మనసులను దోచుకున్నారు వీరిద్దరు. నిజంగా వారులేని లోటు తీర్చలేనిది’’ అని ఆమె తన అధికారిక ఖాతాలో ట్వీట్‌ చేశారు. (నా జీవితంలోకి ప్రేమను తెచ్చారు: అలియా భావోద్వేగం)

కాగా గత రెండేళ్లుగా కాన్సర్‌తో పోరాడిన ఇర్ఫాన్‌ ఖాన్‌(53) బుధవారం ముంబైలో కన్నుమూసిన విషయం విదితమే. ఆ మరుసటి రోజే.. కాన్సర్‌ నుంచి కోలుకున్న రిషి కపూర్‌(67) శ్వాసకోశ సంబంధిత వ్యాధితో ముంబైలోని ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. రెండు రోజుల వ్యవధిలోనే ఇద్దరు దిగ్గజాలు శాశ్వత నిద్రలోకి జారిపోవడంతో సినీ పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ క్రమంలో చిత్ర, రాజకీయ ప్రముఖులతో పాటు అభిమానులు ఇర్ఫాన్‌ ఖాన్‌, రిషి కపూర్‌ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నారు. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా లాక్‌డౌన్‌ అమల్లో ఉన్న నేపథ్యంలో కడచూపునకు నోచుకోలే​క పోయామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇర్ఫాన్‌ ఖాన్‌ లైఫ్‌ ఆఫ్‌ పై, స్లమ్‌డాడ్‌ మిలియనీర్‌ వంటి ప్రముఖ హాలీవుడ్‌ చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే.  (రిషీ కపూర్‌ అనే నేను..)

దేశ ప్రతిష్టను పెంచిన నటుడు.. పోరాడి ఓడిపోయాడు

మరిన్ని వార్తలు