తమిళ హీరోకి బిగ్ బి అవార్డు

23 Dec, 2017 10:05 IST|Sakshi

తమిళ సినిమా: విలక్షణ నటుడు విజయ్‌సేతుపతి... అమితాబ్‌బచ్చన్‌ ఐకాన్‌ అవార్డును అందుకున్నారు. 15వ చెన్నై అంతర్జాతీయ చిత్రోత్సవాలు గత 14వ తేదీ నుంచి చెన్నైలో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రోత్సవాలు గురువారంతో ముగిశాయి. గురువారం సాయంత్రం స్థానిక దేవి థియేటర్‌లో జరిగిన ముగింపు కార్యక్రమంలో ఉత్తమ చిత్రాలకు అవార్డులను అందించారు. ఉత్తమ చిత్రం అవార్డును ఒరు కిడారియిన్‌ కరుణై మను గెలుచుకుంది. సురేశ్‌ చంగయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఈరోస్‌ఇంటర్నేషనల్‌ మీడియా సంస్థ నిర్మించింది. 

ద్వితీయ ఉత్తమ చిత్రం – విక్రమ్‌వేదా గెలుచుకుంది. బాలీవుడ్‌ ప్రఖ్యాత నటుడు అమితాబ్‌ బచ్చన్‌ పేరుతో అందించే అవార్డు విజయ్‌సేతుపతిని వరించింది. అదే విధంగా లోకేశ్‌ కనకరాజ్‌ దర్శకత్వం వహించిన మానగరం చిత్రం ప్రత్యేక జ్యూరీ అవార్డును గెలుచుకుంది. కురంగుబొమ్మై చిత్రంలో నటించిన ప్రముఖ దర్శకుడు భారతీరాజా ప్రత్యేక జ్యూరీ అవార్డును అందుకున్నారు. నటనా శిక్షణ విద్యార్థుల కోసం నెలకొల్పిన అమ్మ అవార్డును డెయిసీ చిత్రం గెలుచుకుంది. ఈ చిత్రానికి ఏ.నారాయణమూర్తి దర్వకత్వం వహించారు. కార్యక్రమంలో నటుడు కే.భాగ్యరాజ్, సుహాసిని, మనోబాల సినీ ప్రముఖులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు