ఎయిర్‌టెల్‌కు మరో షాక్‌ | Sakshi
Sakshi News home page

ఎయిర్‌టెల్‌కు మరో షాక్‌

Published Sat, Dec 23 2017 9:54 AM

 Airtel Payments Bank MD and CEO Shashi Arora resigns - Sakshi

సాక్షి,  న్యూడిల్లీ: భారతీ ఎయిర్‌టెల్‌కు మరోషాక్‌  తగిలింది. టెలికాం దిగ్గజానికి  చెందిన చెల్లింపుల బ్యాంకు ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంకు  మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ శశి అరోరా రాజీనామా చేశారు. ఇటీవల  బ్యాంక్‌పై చెలరేగిన వివాదం,   యుఐడిఎఐ సంస్థ ఇ-కెవైసీ లైసెన్స్ సస్పెన్షన్‌ నేపథ్యంలో ఆయన  తన పదవినుంచి తప్పుకున్నారు.

ఎయిర్‌టెల్‌ వీడాలని అరోరా నిర్ణయించుకున్నారని.. ఆయన భవిష్యత్తు అవకాశాలు మరింత బావుండాలని కోరుతున్నామంటూ కంపెనీ ఒక ప్రకటన విడుదల చేసింది.  కంపెనీ  అభివృద్ధిలో గత కొన్నేళ్లుగా అరోరా విశేష కృషి చేశారని, ముఖ్యంగా ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌కు ఆయన పునాది వేశారని  పేర్కొంది.  కాగా 2006 నుండి సీనియర్ నాయకత్వ  స్థానాల్లో  పనిచేస్తున్న అరోరా ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంకు ఎండీ, సీఈవోగా జూన్ 1, 2016న నియమితులయ్యారు.
 
వినియోగదారుల  అనుమతి లేకుండానే వంటగ్యాస్ సిలిండర్లపై కేంద్రం  అందిస్తున్న సబ్సిడీనీ  పేమెంట్‌ బ్యాంకుకు మళ్లిస్తున్న వైనం ఇటీవల వెలుగులోకి  రావడంతో వివాదం రేగింది. దాదాపు రూ.190 కోట్ల మేర సబ్సిడీ మొత్తం ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యాయి. ఈ వ్యవహారంపై  యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) సీరియస్‌గా స్పందించింది.  ఎయిర్‌టెల్, ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంకుకు ఆధార్ ఇ-కెవైసీ ధ్రువీకరణ అధికారాన్ని నిలిపివేసింది. తుది విచారణ, ఆడిట్ నివేదిక వచ్చేంత వరకు సస్పెన్షన్‌ కొనసాగుతుందని  స్పష్టం చేసింది.  
 

Advertisement
Advertisement