కథ విని చిరంజీవిగారు అలా అన్నారు

11 Jul, 2018 00:25 IST|Sakshi

‘‘విజేత’ కథ కొత్తవారికైనా, ఎస్టాబ్లిష్డ్‌ హీరోలకైనా సరిపోతుంది. ఏ హీరో అంటే ఆ హీరో అని మా నిర్మాత నాకు ఫ్రీడమ్‌ ఇచ్చారు. అప్పుడు నేను వైజాగ్‌ సత్యానంద్‌గారి దగ్గరకు వెళ్లి ‘ఈ బ్యాచ్‌లో ఎవరైనా కొత్తవారు ఉన్నారా?’ అని అడిగా. ఆయన నాకు కల్యాణ్‌గారి గురించి చెప్పారు. కల్యాణ్‌గారు చిరంజీవిగారి అల్లుడని అప్పుడే మాకు తెలిసింది’’ అని దర్శకుడు రాకేష్‌ శశి అన్నారు. కల్యాణ్‌ దేవ్, మాళవికా నాయర్‌ జంటగా సాయి శివాని సమర్పణలో రజని కొర్రపాటి నిర్మించిన ‘విజేత’ రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా రాకేష్‌ శశి పంచుకున్న విశేషాలు... 

∙నేను ఎమ్మెస్సీ ఇండస్ట్రియల్‌ ఎలక్ట్రానిక్స్‌ చేశా. 2006లో హైదరాబాద్‌ వచ్చాను. 2007లో రాఘవేంద్రరావుగారి టీవీ షో ‘రేపటి దర్శకులు’లో టాప్‌ టెన్‌లో ఉన్నా. ‘రక్తచరిత్ర’లో డైలాగ్‌ వెర్షన్‌ రాశాను. పరుచూరి బ్రదర్స్, చిన్నికష్ణగారి వద్ద పనిచేశాను. ‘రుద్రమదేవి’ చిత్రానికి డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తూ, బయటికి వచ్చాను.

∙తండ్రీ కొడుకుల మధ్య సాగే కథే ‘విజేత’. మనలో ఉన్న 90 శాతం మంది కథ ఇది. మన దేశంలో మధ్య తరగతి కుటుంబాలు ఎక్కువ. ఆ జర్నీలోని బాధలు, సంతోషాలు, అవమానాలన్నింటినీ ప్రతిబింబిస్తుంది. శ్రీనివాసరావు అనే ఫ్యాక్టరీ ఉద్యోగి, అతని కొడుకు ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్‌ అయిన రామ్‌ పాత్రలు హైలైట్‌. వాళ్ల ఫ్యామిలీ ఎలాంటి పరిస్థితులను దాటుకుని ముందడుగేసింది అనేది సినిమా.  
∙చిరంజీవిగారి ‘విజేత’ చిత్రానికీ, మా ‘విజేత’కు ఎక్కడా పోలికలు ఉండవు. చాలా టైటిల్స్‌ అనుకున్నాం. ఒక మనిషి విజయం మీదనే కథ సాగుతుంది కాబట్టి ‘విజేత’ అని ఫిక్స్‌ చేశాం. చిరంజీవిగారి పర్మిషన్‌ తీసుకునే ఈ టైటిల్‌ పెట్టాం. 

∙‘విజేత’ కథను ముందు కల్యాణ్‌గారికి చెప్పా. రెండు రోజుల దాకా ఆయన్నుంచి ఎలాంటి స్పందనా లేకపోవడంతో నచ్చలేదేమో అనుకున్నా. ఒక రోజు ఫోన్‌ చేసి చిరంజీవిగారికి కథ చెప్పమన్నారు. సరేనని వెళ్లా. చిరంజీవిగారు కథ మొత్తం విని ‘నువ్వు నాకు ఏం చెప్పావో అది తియ్‌  చాలు’ అన్నారు. డీఐ కాకముందు ఓసారి సినిమా చూశారు. ఆయనకు చాలా బాగా నచ్చింది. ∙కల్యాణ్‌గారు చాలా హోమ్‌ వర్క్‌ చేశారు. కొత్త విషయాలను నేర్చుకోవాలనే తత్వం ఉంది. మాళవిక ఇందులో ఇండిపెండెంట్‌ విమెన్‌గా నటించారు. ఈ చిత్రకథ కల్పన కాదు. నేను పుట్టిందే మిడిల్‌ క్లాస్‌లో. నా ఫ్రెండ్స్‌ చాలామంది మిడిల్‌ క్లాస్‌కి చెందినవాళ్లే. నా 12 ఏళ్లప్పుడు మా నాన్న చనిపోయారు. నేను చూసిన జీవితం ఈ సినిమాలో ఉంటుంది. 

మరిన్ని వార్తలు