నీరవ్‌ మోదీ కార్లను వేలం వేయనున్న ఈడీ

3 Nov, 2019 12:46 IST|Sakshi

ముంబయి : వజ్రాల వ్యాపారి, ఆర్థిక నేరస్తుడు నీరవ్‌ మోదీ చుట్టూ మరింత ఉచ్చు బిగుసుకోనుంది. తాజాగా అతనికి చెందిన 13 కార్లను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌(ఈడీ) వేలం వేయనుంది. కాగా, ఈ వేలం నవంబర్‌ 7న జరగనుంది. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు కుంభకోణంలో నిందితుడిగా ఉన్న నీరవ్‌ మోదీని గతేడాది మార్చిలో లండన్‌లో అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం లండన్‌లోని వాండ్స్‌వర్త్‌ జైళ్లో ఉన్న నీరవ్‌ మోదీ బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. దీనికి సంబంధించిన విచారణ నవంబర్‌ 6న జరగనుంది. 

అయితే ఈ ఏడాది ఆగస్టులో నీరవ్‌ మోదీ ఆస్తులన్నింటిని జప్తు చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ  ఈడీ మనీ లాండరింగ్‌ చట్టం కింద ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ మేరకు నీరవ్‌కు చెందిన విలువైన వాచ్‌లు, పెయింటింగ్స్‌, కార్లను వేలం వేయడానికి అనుమతి పొందింది. ఇందులో భాగంగానే నవంబర్‌ 7న కార్ల వేలం వేయనున్నారు.అయితే వేలం వేయనున్న కార్లలో బెంట్లీ ఆర్నేజ్ , రోల్స్ రాయిస్ ఘోస్ట్  ఎంహెచ్‌, పోర్స్చే పనామెరా, మెర్సిడెస్ బెంజ్ వంటి ఖరీదైన కార్లు ఉన్నాయి.

మరిన్ని వార్తలు